BJP Somu Veerraju on HC Verdict: మూడు ముక్కల్లాగా మూడు రాజధానులకు తాము వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. రాజధాని లేకుండా రెండు ప్రాంతీయ పార్టీలూ..రాష్ట్ర ప్రజలను నడిరోడ్డుమీద నిలబెట్టారని ఆరోపించారు. రాజధాని రైతులు ఈ విషయంలో వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ రోజు రాష్ట్రంలో పరిణామాలకు ప్రాంతీయ పార్టీల విధానాలే కారణమని దుయ్యబట్టారు. గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులను జగన్ ప్రభుత్వం మళ్లించడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. పల్లెల బాగుపై సీఎంకు చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేకపోగా.. వచ్చే నిధులను ఇష్టానుసారంగా వాడుతున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో అనేక రైల్వే ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చి సహకరించకుండా అడ్డుకుంటోదని ఆరోపించారు.
BJP Purandeswari on Amaravathi: రాజధాని అంశంలో హైకోర్టు తీర్పుపై ఎంపీ పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. అమరావతే రాజధానిగా ఉండాలని భాజపా తొలి నుంచి కోరుకుంటోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అన్నారు. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా.. రాజధాని వివాదాలకు ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
ఇదీ చదవండి : Farmers Celebrations: అమరావతి తీర్పుపై రైతుల హర్షం.. మిఠాయిలు పంచుకుని సంబరాలు
BJP Vishnu on HC Verdict: రాజధాని అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని భాజపా నేత విష్ణుకుమార్‌రాజు తెలిపారు. ఇంత కాలానికి అమరావతి రైతులకు న్యాయం జరిగిందన్నారు. రైతులను దగా చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు బుద్ధి చెప్పిందన్నారు. భాజపా ఎప్పుడూ అమరావతి పక్షాన నిలుస్తామని హామీ ఇచ్చారు. అమరావతి మహిళా రైతుల కృషికి అభినందనలు తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్.. పంతాలకు పోకుండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించాలని సూచించారు.
రాష్ట్రంలో మర్యాదగా మాట్లాడే పరిస్థితి లేదు -ఎంపీ సుజనా చౌదరి
రాష్ట్రంలో భాజపా బలోపేతానికి అంతా కృషి చేయాలని ఎంపీ సుజనాచౌదరి పిలుపునిచ్చారు.వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులు, మోసాలను ప్రజలకు వివరించాలన్నారు.రాష్ట్రంలో మర్యాదగా మాట్లాడే పరిస్థితి, వాతావరణం లేదని ఆవేదన చెందారు. వైకాపా నియంతృత్వ, దుర్మార్గమైన పాలనకు చరమ గీతం పాడాలని సూచించారు. ప్రతిభ ఉన్నా.. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే యువత భాజపాలోకి రావాలని కోరారు.
ఇదీ చదవండి: Amaravati Victory: అమరావతికి అనుకూలంగా తీర్పు.. ఫలించిన రైతుల పోరాటం