నిత్యం ఖాతాదారులతో కిటకిటలాడే బ్యాంకుల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో రోజూ ఏదో ఒక బ్యాంకు శాఖలోని సిబ్బంది దీని బారినపడుతున్నారు. వీరిలో క్లరికల్ సిబ్బందే ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా గత నెల రోజుల్లో 200 మంది సిబ్బందికి కరోనా సోకిందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఖాతాదారులు వస్తుండటంతో వైరస్ వ్యాప్తికి ఆస్కారం కలుగుతోంది. ఏదైనా శాఖలో ఒకరిద్దరికి పాజిటివ్ వస్తే కొన్ని చోట్ల 2, 3 రోజులు కార్యాలయాన్ని మూసేస్తున్నారు. మరికొన్ని చోట్ల శానిటైజ్ చేయించి మరుసటి రోజే తెరుస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సిబ్బంది తాత్కాలికంగా సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారు.
ప్రమాదకరమవుతోంది ఇలా!
3 నెలలుగా జన్‌ధన్ ఖాతాల్లో కేంద్రం రూ.500 చొప్పున జమ చేస్తోంది. సంక్షేమ పథకాల నిధులు బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. సాగు సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ రుణాలు, ఇతర అవసరాల కోసం వినియోగదారుల తాకిడి పెరిగింది. అధిక శాతం ఖాతాదారులు భౌతిక దూరం పాటించడంకానీ, మాస్కులు ధరించడంకానీ చేయడం లేదు. ఫలితంగా వారితోపాటు, బ్యాంకు సిబ్బందికీ ముప్పు ఏర్పడుతోంది. వీలైనంతవరకు ఆన్‌లైన్, ఏటీఎం, సీడీఎంల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవాలని సిబ్బంది సూచిస్తున్నా... చాలామంది చిన్నచిన్న అవసరాలకూ బ్యాంకుకే వస్తున్నారు.
విజయవాడ పరిసర ప్రాంతాల్లో దాదాపు 20మంది బ్యాంకు ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. విజయవాడ సత్యనారాయణపురంలోని ఓ బ్యాంకు శాఖలో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. వారంపాటు దాన్ని మూసి తర్వాత తెరిచారు. కృష్ణలంకలోని ఓ శాఖలోనూ పలువురికి వైరస్ సోకింది. విశాఖపట్నం సీతమ్మధార ప్రాంతంలోని ఓ బ్యాంకు ప్రాంతీయశాఖలో కొంతమంది సిబ్బంది కొవిడ్ బారినపడ్డారు. 15 రోజులకోసారి సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు.
రాష్ట్రంలో దాదాపు 200మంది బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దీని నుంచి సిబ్బందిని రక్షించేందుకు 15రోజులకోసారి పరీక్షలు చేయించాలి. రోజూ సాయంత్రం కార్యాలయాన్ని శానిటైజ్ చేయించాలి. బ్యాంకు లోపలికి ఒకేసారి నలుగురైదుగురు మించి వెళ్లకుండా నియంత్రించాలి. ప్రతి ఒక్కర్ని శానిటైజ్ చేసి, మాస్కు ఉండేలా చూడాలి. 60ఏళ్లు పైబడిన వృద్ధులు లోపలికి వెళ్లి, త్వరగా బయటకొచ్చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
ఉద్యోగులు కోరేదిదీ..
- పనివేళల్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు కుదించాలి.
- సగంమందితో పనిచేయటానికి అనుమతించాలి.
- కంటెయిన్‌మెంట్ జోన్లలోని శాఖలను శానిటైజ్ చేయటంతోపాటు కొన్నిరోజులు మూసేయాలి.
- వారానికోసారి పరీక్షలు చేయించాలి.
పై డిమాండ్లతో ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తున్నట్లు విశాఖపట్నం జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షుడు ఆర్.వి.రవికుమార్ చెప్పారు.