ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లను... గ్రామ, మున్సిపల్ వార్డుల సచివాలయాల పోస్టుల నియామకాల్లో అమలు చేయాలని కోరుతూ దాఖలైన వాజ్యంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈడబ్ల్యూఎస్ కు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లను గ్రామ, మున్సిపల్ వార్డుల సచివాలయాల్లో అమలు చేయాలని కోరుతూ.. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పి . రాకేష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
వాడీవేడిగా వాదనలు...
ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన అంశంపై పిల్ ఎలా దాఖలు చేస్తారని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు పిటిషినర్ తరపున న్యాయవాది బదులిస్తూ.. 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని చట్టం ఉందన్నారు. దానిని రాష్ట్ర ప్రభుత్వం అనుసరించలేదని చెప్పారు. అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ ప్రభుత్వం తరఫున వాదిస్తూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాల్ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయన్నారు. ఇదే అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆ రిజర్వేషన్ల అమలు సాధ్యం కాలేదని వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం... తగిన ఉత్తర్వులు జారీచేస్తామని తీర్పు రిజర్వ్లో ఉంచింది.
ఇదీ చదవండి