Appointment of advisors: అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా సలహాదారుల్ని నియమిస్తూ, వారికి జీతభత్యాల రూపంలో రూ.కోట్లు దోచిపెట్టడాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టినా ప్రభుత్వ వైఖరిలో మార్పులేదు. దేవాదాయశాఖకు సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్ నియామకంపై హైకోర్టు స్టే ఇచ్చి.. ఐదు రోజులు గడవకముందే మరో సలహాదారుడిని నియమించింది. మైనారిటీల సంక్షేమశాఖకు కర్నూలు జిల్లాకు చెందిన డి.ఎస్.హబీబుల్లాను సలహాదారుగా నియమిస్తూ ఆగస్టు 29న ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే శాఖకు సలహాదారుగా ఇదివరకే నియమితులైన షేక్ మహ్మద్ జియావుద్దీన్‌కి కేబినెట్ హోదా కల్పిస్తూ మరో జీవో ఇచ్చింది. జియావుద్దీన్ మైనారిటీల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటారని, హబీబుల్లా మైనారిటీల సంక్షేమశాఖకు సలహాదారుగా ఉంటారని పేర్కొంది.
శ్రీకాంత్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ఆగస్టు 24న సలహాదారుల నియామకాలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వారు రాజ్యాంగేతర శక్తుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడింది. మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్థం చేసుకోగలంగానీ, ప్రభుత్వ శాఖలకు సలహాదారులేమిటని నిలదీసింది. ఇంతమందిని నియమిస్తున్నారంటే ప్రభుత్వంలో అధికారుల కొరతేమైనా ఉందా అని ప్రశ్నించింది. అయినా ఇలా నియమించడం వైకాపా నాయకులకు రాజకీయ పునరావాసం కల్పించేందుకే తప్ప, ప్రయోజనమేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: