APEX Council Meeting: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్... బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు పురోగతి పైనే ప్రధానంగా దృష్టి సారించారు. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రాజెక్టుల కాంపోనెంట్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్వాధీనం అంశంపై చర్చించారు. ఇప్పటి వరకు జరిగిన కసరత్తుపై ఆరా తీసిన పంకజ్ కుమార్... బోర్డు సమావేశాలతో పాటు ఉపసంఘం భేటీల సారాంశాన్ని అడిగి తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాల నుంచి అందిన ప్రాజెక్టుల వివరాలు, సమాచారాన్ని తెలుసుకున్నారు. గెజిట్ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సమావేశాలు, చర్చల సారాంశంతో పాటు రాష్ట్రాల నుంచి వచ్చిన స్పందనను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్‌కు వివరించారు.
ఉమ్మడి అంశాలపై..
కేంద్ర జలశక్తిశాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అత్యున్నత మండలిని త్వరలోనే సమావేశపరచాలని భావిస్తున్నారు. ఆ దిశగానే బోర్డు ఛైర్మన్లతో సమీక్షించి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎజెండా కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పంకజ్ కుమార్ నెల రోజుల క్రితం సమీక్ష నిర్వహించారు. అందుకు సంబంధించిన మినిట్స్‌ను కూడా కొన్ని రోజుల క్రితం రాష్ట్రాలకు పంపారు. కొత్త రాష్ట్రానికి నీటికేటాయింపుల కోసం ట్రైబ్యునల్‌కు నివేదించాలన్న విజ్ఞప్తి, గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌ల ఆమోదం, ప్రాజెక్టుల సీఐఎస్ఎఫ్ బలగాల భద్రత అంశాలపై అత్యున్నత మండలి సమావేశంలో చర్చించాలని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ప్రతిపాదించినట్లు తెలిపింది. బోర్డులతో రెండు రాష్ట్రాలకు ఉన్న ఉమ్మడి అంశాలపై దృష్టి సారించాలని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి సూచించారు.
అత్యున్నత మండలిని సమావేశపరిచే అవకాశం
ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించే ప్రక్రియని వేగవంతం చేయాలని... శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను ప్రాధాన్యంగా పరిగణించాలని తెలిపారు. నిర్వహణ కోసం బోర్డులకు రెండు రాష్ట్రాలు ఇవ్వాల్సిన సీడ్ మనీ విషయంలోనూ సానుకూలంగా స్పందించాలని సీఎస్‌లతో సమావేశం సందర్భంగా పంకజ్ కుమార్ చెప్పారు. వీటన్నింటి నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలతో పాటు నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ అమలు విషయమై అత్యున్నత మండలిని సమావేశపరిచే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: