కృష్ణా నదిలో తమ నీటి వాటాకు తెలంగాణ ఎసరు పెడుతోందని ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ చేపడుతున్న రాజ్యాంగ విరుద్ధ, చట్ట వ్యతిరేక చర్యలతో కృష్ణా జలాల్లో తమకు దక్కాల్సిన సాగు, తాగునీటి వాటాలను కోల్పోతున్నామంటూ సర్వోన్నత న్యాయస్థానానికి మొరపెట్టుకొంది. రాష్ట్ర ప్రజల జీవన, ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఈ అంశంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కమిటీ నిర్ణయాలను, కృష్ణా బోర్డు, బచావత్ అవార్డు మార్గదర్శకాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. జల విద్యుదుత్పత్తి కోసం అనధికారంగా 63.12 టీఎంసీల నీటిని వినియోగించుకుందని ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీ ద్వారా మేం నీరు తీసుకోకూడదనే ఏకైక ఉద్దేశంతో తెలంగాణ శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తోడేసిందని ఆరోపించింది. దీని వల్ల 2.30 కోట్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొంది. సర్వోన్నత న్యాయస్థానం స్పందించి తగిన ఆదేశాలు జారీ చేయకపోతే తమకు పూడ్చుకోలేని నష్టం వాటిల్లుతుందని చెప్పింది. ఇప్పటికే తెలంగాణ అక్రమంగా వాడుకున్న నీటిని వారి వాటా 299 టీఎంసీల్లో నుంచి మినహాయించి 2021-22 సంవత్సరానికి కేటాయింపులు జరపాలని కోరింది.
కృష్ణాపై ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలతో పాటు వాటి నుంచి నీటి విడుదల, విద్యుదుత్పత్తి తదితర అంశాలను కేంద్ర ప్రభుత్వం తన నియంత్రణలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-1) నిర్దేశిత నియమాల ప్రకారం వాటిని నిర్వహించాలని, అవసరమైతే ఆ జలాశయాలకు పోలీసు రక్షణ కల్పించాలని విన్నవించింది.
పిటిషన్‌లోని ప్రధాన అంశాలు..
* 2014 పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉన్నా అసాధారణంగా ఏడేళ్లపాటు ఆలస్యమైంది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధి నిర్దేశించేందుకు 2020 అక్టోబరు 6న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జల్‌శక్తి మంత్రితో కూడిన అపెక్స్ కమిటీ సమావేశమైంది. ఈ విషయంలో తెలంగాణ సీఎం అంగీకారాన్ని తెలపలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం బోర్డుల పరిధి నిర్దేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని జల్‌శక్తి మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలతో పాటు వాటి నుంచి నీటి విడుదల, విద్యుదుత్పత్తి తదితర అంశాలను కేంద్ర ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకోవాలి.
* తమ పరిధిలోని జలవిద్యుత్ కేంద్రాల్లో వంద శాతం సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేసేందుకు తెలంగాణ విద్యుత్తు శాఖ జీవో నంబర్ 34ను ఏకపక్షంగా విడుదల చేసింది. విచక్షణారహితమైన ఈ ఉత్తర్వును రద్దు చేయాలి. జల విద్యుదుత్పత్తి కోసం అనధికారంగా 63.12 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించుకుంది. ఫలితంగా ప్రకాశం బ్యారేజీ నుంచి 7.54 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసింది. సాగునీటి అవసరాల రీత్యా శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తికి నీటి విడుదలను ఆపాలి. దీనిపై ఇప్పటికే మేం ప్రధాని, జల్‌శక్తి మంత్రికి ఫిర్యాదు చేశాం.
* శ్రీశైలం నుంచి విద్యుత్తు కోసం తెలంగాణ నీరు విడుదల చేయడం కేడబ్ల్యూడీటీ-1 నిబంధనలు, బచావత్ ట్రైబ్యునల్ నియమాలను ఉల్లంఘించడమే. తెలంగాణ చర్యలతో మా రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడిన ఎస్సార్బీసీ, తెలుగు గంగ ప్రాజెక్టు, నాగార్జునసాగర్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, జీఎన్‌ఎస్‌ఎస్, వెలిగొండ, గుంటూరు ఛానల్, కృష్ణా డెల్టా పరిధిలోని 44.78 లక్షల ఎకరాల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చెన్నై నగర తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతుంది.
* శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 28.25 టీఎంసీలు, అక్కడి నుంచి పులిచింతలకు 26.18 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా విడుదల చేసింది. ఈ పరిస్థితుల్లో ఎగువ రాష్ట్రాల నుంచి శ్రీశైలానికి వరద రాకపోతే నాగార్జునసాగర్ ఎండిపోయి ఆయకట్టు రైతులకు అన్యాయం జరగుతుంది.
* విద్యుదుత్పత్తి కోసం పులిచింతల నుంచి 5.36 టీఎంసీల నీరు అక్రమంగా విడుదల చేయడం చట్టవిరుద్ధం.
* కృష్ణా బోర్డు అనుమతితోనే ఉమ్మడి జలాశయాల నుంచి రెండు రాష్ట్రాలు నీరు విడుదల చేయాలి. తెలంగాణ ప్రభుత్వం దీనికి విరుద్ధంగా నీరు వాడుకుంటోంది.
* శ్రీశైలం జలాశయానికి ఈ నెల 13 వరకు 29.05 టీఎంసీలు నీరు రాగా తెలంగాణ ప్రభుత్వం 27.93 టీఎంసీలను అనధికారికంగా విద్యుదుత్పత్తికి వినియోగించుకుంది. దాంతో 854 అడుగుల మేర ఉండాల్సిన నీరు 839.08 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలో 854 అడుగుల మేర నీరు ఉంటేనే ఎస్సార్బీసీ, తెలుగు గంగ, జీఎన్‌ఎస్‌ఎస్ పరిధిలో సాగుకు, చెన్నైకు తాగునీటి అవసరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా వాడుకున్న 27.78 టీఎంసీలకు తోడు మరో 27.93 టీఎంసీల నీరొస్తే తప్ప శ్రీశైలం నీటిమట్టం 854 అడుగులకు చేరే పరిస్థితి లేదు.
* విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న నిబంధనలను అమలు చేయని ఏ రాష్ట్రమైనా కేంద్ర ప్రభుత్వం విధించిన జరిమానాను చెల్లించాలి. తెలంగాణ ప్రభుత్వ చర్యలు తప్పు అని ఇప్పటికే కృష్ణా బోర్డు తేల్చింది. ఈ తప్పుడు చర్యలతో తెలంగాణకు పెద్దగా మేలు జరగకపోయినా మాకు భారీ నష్టం వాటిల్లింది.
మరో మార్గం లేకే సుప్రీంకు..
కృష్ణా జలాల్లో ఏపీ నీటి వాటాను కోల్పోయేలా తెలంగాణ వ్యవహరిస్తోందని.. సాగునీటి అవసరాలతో సంబంధం లేకుండా, జలవిద్యుత్తు ఉత్పత్తి కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు సుప్రీంకోర్టు తలుపు తట్టడం తప్ప తమకు ప్రత్యామ్నాయ మార్గం లేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పని చేయడం లేదని, ఇది వారి న్యాయబద్ధమైన విధులు నిర్వహించేలా మరింత తోడ్పడుతుందని తెలిపింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు లేఖ రాశారు. మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఈ లేఖను పంపారు. ‘తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై ఉమ్మడి జలాశయాల్లో నీటి వినియోగంపై ఉన్న విధివిధానాలను ఉల్లంఘిస్తూ జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తోందని మా ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ 2014 విభజన చట్టం సహా అన్నింటినీ ఉల్లంఘిస్తోందని మరోసారి మీకు తెలియజేస్తున్నాం. తెలంగాణ శ్రీశైలంలో నీటిమట్టాలు నిలబడకుండా విద్యుదుత్పత్తి చేసేస్తోంది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రావిటీ ద్వారా నీరు పొందేందుకు శ్రీశైలంలో ఉండాల్సిన +854 అడుగుల నీటిమట్టాన్ని నిలబెట్టడమే కష్టమవుతోంది. ఫలితంగా తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీటిని అందించలేం. తెలంగాణ కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండా సాగర్, పులిచింతల నుంచి ఏకపక్షంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది. ఏపీకి ఉన్న కేటాయింపుల ప్రకారం నీటిని ఇవ్వకుండా ఉండేందుకు, నీటి విడుదల ఆలస్యం చేసే వ్యూహంలో భాగంగానే తెలంగాణ ఇలా వ్యవహరిస్తోందనిపిస్తోంది. నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయేలా చేస్తోంది’ అని లేఖలో పేర్కొన్నారు.
బోర్డు పరిధిని త్వరగా తేల్చండి
‘బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ప్రాజెక్టులవారీ కేటాయింపులు జరిపే వరకు కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయొద్దంటూ తెలంగాణ ఏడేళ్లుగా అడ్డుపడుతోంది. అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. బోర్డు పరిధిని త్వరగా నోటిఫై చేయాలని, ఉమ్మడి జలాశయాల నుంచి నీటిని తీసుకునే ఆఫ్‌టేక్ పాయింట్లు దాని పరిధిలోకి తీసుకొచ్చి సీఐఎస్‌ఎఫ్ భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నాం. విద్యుదుత్పత్తి నిలిపివేసేలా కేంద్రం కృష్ణా బోర్డు ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. బోర్డు ఆదేశాలను కూడా తెలంగాణ లెక్క చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టులోనే న్యాయం కోరాలని నిర్ణయించుకున్నాం’ అని లేఖలో వివరించారు.
ఇదీ చదవండి: ADIMULAPU SURESH: 'విద్యా సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్ పూర్తి చేయండి'