పురపాలక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియనూ నిలిపిన చోటనుంచి కొనసాగించాలా.. లేక తిరిగి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలా అనే విషయమై తేల్చేందుకు న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో అత్యధిక స్థానాల్లో అధికార వైకాపా అక్రమంగా ఏకగ్రీవం చేసిందని.. విపక్షాలు ఎస్ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాయి. వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయమై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమాలోచనలు జరుపుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్ధితి ఎక్కడైనా వచ్చిందా.. వస్తే అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశంపై ఆరా తీస్తున్నారు.
ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ల నివేదికను కోరిన ఎస్‌ఈసీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ చర్చించారు. సీఎస్‌తో అరగంట పాటు జరిగిన సమావేశంలో బుధవారం జరిగే మూడోదఫా పంచాయతీ ఎన్నికల నిర్వహణతోపాటు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ ఆలోచనను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.
మార్చి 10న పురపాలక పోలింగ్ జరుగుతుండగా.. మార్చి 14న కౌంటింగ్‌తో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ యోచిస్తున్నట్లు తెలిసింది. దీనికోసం కొద్దిరోజుల ముందే సిద్ధం కావాల్సి ఉన్నందున న్యాయ నిపుణులతో చర్చించి అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: పుర పోరు: బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఫిర్యాదులపై ఎస్‌ఈసీ స్పష్టత