ఉద్యోగుల అభీష్టానికి వ్యతిరేకంగా కొత్త వేతన సవరణ ప్రకారం జీతాలు ఇచ్చేయాలని ఏపీ ప్రభుత్వం పట్టుదలగా ఉన్నా ఆ ప్రక్రియ ముందుకు సాగట్లేదు. ఆదివారం కూడా విధులకు హాజరై ఈ ప్రక్రియ చేపట్టాలని ఖజానా శాఖ అధికారులు తమ సిబ్బందిని ఆదేశించినా పరిస్థితి మందగమనంగానే ఉంది. ఖజానా సిబ్బంది అక్కడక్కడే హాజరై ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. మరోవైపు సర్వర్ సహకరించకపోవడంతో పని ముందుకు సాగలేదని చెబుతున్నారు. జనవరి నెల జీతాల బిల్లుల ప్రక్రియ ముగించేందుకు ఇక ఒక్కరోజే మిగిలింది. ఎంత మేర బిల్లులు ప్రాసెస్ చేస్తారనేది ప్రశ్నార్థకమే. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ జనవరి జీతాల బిల్లులు పెద్దగా సమర్పించలేదు. రాష్ట్రంలో మొత్తం 16,700 మంది డ్రాయింగ్ డిస్‌బర్సింగ్ అధికారులు ఉన్నారు. వీరిలో కొన్నిచోట్లే బిల్లులు సమర్పించే ప్రక్రియ జరిగింది. పోలీసుశాఖలో వీటి సంఖ్య ఎక్కువ. వీటినీ ఖజానా అధికారులు పరిశీలించాలి. 500 మంది డీడీవోలకు సంబంధించి మాత్రమే కొంతమేర జరిగినట్లు అధికారవర్గాల సమాచారం.
డీడీవోలపై చర్యలకు సిఫార్సులు
అక్కడక్కడ కలెక్టర్లు జీతాల బిల్లులు ప్రాసెస్ చేయని ఒకరిద్దరు డీడీవోలు, ఖజానా అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జనవరి 29 సాయంత్రం 6గంటల వరకు ఏ డీడీవో వద్ద బిల్లుల ప్రగతి ఎలా ఉందో పేర్కొంటూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులిచ్చారు.
పింఛన్ల ప్రక్రియ పూర్తి
రాష్ట్రంలోని మొత్తం 4 లక్షలకు పైగా పింఛనర్లకు జనవరి నెల పింఛను కొత్త స్కేళ్ల ప్రకారం చెల్లించేందుకు రంగం సిద్ధమయింది. 2018 జులై ముందు పదవీవిరమణ చేసిన వారితో పాటు ఆ తర్వాత పదవీవిరమణ చేసిన వారికీ కొత్త పింఛన్ల బిల్లులు సిద్ధం చేశారు. ఆ మేరకు వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇదీ చదవండి: పట్టణ, స్థానిక సంస్థలకు.. విద్యుత్తు పంపిణీ సంస్థల షాక్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!