దసరా తర్వాత గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో లోడ్ రిలీఫ్ కింద గంటల కొద్దీ విద్యుత్ కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఒక ప్రకటనలో స్పష్టంచేశాయి. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై డిస్కంల సీఎండీలు హరనాథరావు, పద్మా జనార్దన్‌రెడ్డి, సంతోష్‌రావు, గ్రిడ్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, గ్రిడ్ సీఈ భాస్కర్‌లతో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ఫోన్‌లో సమీక్షించినట్లు తెలిపాయి. వివరాలు... ‘‘రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ 185 ఎంయూలుగా ఉంది. గత అయిదు రోజుల్లో విద్యుత్ డిమాండ్‌లో సగటున 1.22 మిలియన్ యూనిట్ల కంటే తక్కువ లోటుంది’’ అని పేర్కొన్నాయి.
బొగ్గు ఎక్కడ ఉన్నా కొంటాం
‘‘దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడ ఉన్నా... కొనుగోలు చేసేందుకు జెన్‌కోకు రూ.250 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. పరిస్థితి సర్దుబాటుకు రోజూ అదనంగా ఎనిమిది రైల్వే ర్యాక్‌లను కేంద్రం అందిస్తోంది. సింగరేణితో సమన్వయం చేసుకుని రాష్ట్రానికి అవసరమైన బొగ్గును తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి ఎవరికీ కేటాయించని వాటా నుంచి 400 మెగావాట్ల చౌక విద్యుత్‌ను వచ్చే ఏడాది జూన్ వరకు కేటాయించాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. విజయవాడలోని వీటీపీఎస్, కృష్ణపట్నంలోని 1,600 మెగావాట్ల సామర్థ్యమున్న ప్లాంట్లను త్వరలో ఉత్పత్తిలోకి తెస్తాం. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ ధరలు శుక్రవారం యూనిట్‌కు రూ.20 నుంచి రూ.6.11కు తగ్గడం కొంత ఊరట కలిగిస్తోంది’’ అని తెలిపాయి.
థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వల పరిస్థితి
- వీటీపీఎస్‌లో 47,299 టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇక్కడ రోజుకు 28,500 టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుత నిల్వలు 1.65 రోజులకు కూడా సరిపోవు.
- ఆర్‌టీపీపీలో 96,400 టన్నులుంది. ఇక్కడ కొన్ని యూనిట్లు వినియోగంలో లేకపోవటంతో రోజుకు 12,925 టన్నులే వినియోగం అవుతోంది. యూనిట్లన్నీ పనిచేస్తే రోజుకు 21 వేల టన్నులు అవసరం. దీని ప్రకారం 4.59 రోజుల వినియోగానికి మాత్రమే నిల్వలు సరిపోతాయి.
- కృష్ణపట్నంలో 68,459 టన్నుల నిల్వలున్నాయి. ప్రస్తుతం 8,533 టన్నుల వినియోగముంది. రెండు యూనిట్లు ఉత్పత్తిలోకి వస్తే రోజుకు 19 వేల టన్నులు అవసరం అవుతుంది. దీని ప్రకారం 3.15 రోజులకు మాత్రమే వస్తుంది.
నిరంతర సరఫరాకు చర్యలు: మంత్రి బాలినేని
రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలులో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... బొగ్గు కొరతతోనే సరఫరాలో కొంత సమస్య వచ్చిందన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూస్తున్నామని తెలిపారు. దేశ రాజధాని దిల్లీలో ఆరు గంటలపాటు కోతలు విధిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. విద్యుత్ కోతలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై విచారించి, చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
పశువైద్య వర్సిటీలో ఏసీలు వాడొద్దని ఆదేశాలు
రాష్ట్రంలోని పశువైద్య, డెయిరీ, మత్య్స, పశు సంవర్ధక పాలిటెక్నిక్ కళాశాలలు, పరిశోధన స్థానాల్లో ఏసీలను వాడొద్దని తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య వర్సిటీ అధికారులు ఆదేశించారు. వర్సిటీ బడ్జెట్ సమస్యల కారణంగా నవంబరు ఒకటి నుంచి ఏసీల వినియోగాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా నిలిపివేయాలని స్పష్టంచేశారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతతో అన్ని శాఖలు నియంత్రణ చర్యలు పాటిస్తున్న తరుణంలో... బడ్జెట్ కొరతతో ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: