రాష్ట్రంలో సోమవారం పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాలకు అధికార పార్టీ స్థానికేతరులను తరలించి, వారితో ఓట్లు వేయించేందుకు ప్రయత్నించిందని తెదేపా శ్రేణులు పలుచోట్ల ఆందోళనలకు దిగాయి. పోలీసులు, ఎన్నికల సిబ్బంది అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ నిరసన తెలిపాయి. కుప్పంలో బయటి వ్యక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఓ విద్యాసంస్థలో గుమికూడటాన్ని తెదేపా శ్రేణులు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అక్కడ మొదలైన వివాదం.. రోజంతా ఉద్రిక్తతకు దారితీసింది.
దర్శిలోనూ దొంగ ఓట్లపై తెదేపా కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరులో వైకాపా అభ్యర్థి ఇంటి వద్దే డబ్బులు పంచుతున్నారంటూ విపక్షాలు అధికారుల దృష్టికి తెచ్చారు. నెల్లూరులోనూ నకిలీ ఓటర్లు పోటెత్తారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై తెదేపా రాష్ట్ర నాయకత్వం విజయవాడలో ఎస్‌ఈసీ నీలం సాహ్నీని కలిసి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం పరిణామాలపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కుప్పానికి పెద్దఎత్తున చేరుకున్న ఇతర ప్రాంతాల వారిని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. తిరిగి తెదేపా శ్రేణులపైనే లాఠీఛార్జి చేశారంటూ ఆగ్రహించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. దొంగ ఓట్లు పోలై ఉంటే.. నాలుగు దశాబ్దాలుగా కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబుదే బాధ్యత అని వ్యాఖ్యానించారు.
కుప్పంలో స్థానికేతరులకు చీటీల పంపిణీపై రగడ
ఇటీవల జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల నాటి దృశ్యాలే కుప్పం పురపాలిక ఎన్నికల్లో పునరావృతమయ్యాయి. స్థానికేతర మహిళలు దొంగ ఓట్లు వేసేందుకు పెద్దసంఖ్యలో రావడం, వారిని అడ్డుకునేందుకు తెదేపా శ్రేణులు ప్రయత్నించడం.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పోలీసులు తెదేపా కార్యకర్తలపైనే లాఠీఛార్జి చేయడం.. వంటి వరుస పరిణామాలతో ఉద్రిక్తత నెలకొంది. 16వ వార్డులో స్థానికేతరులకు ఓటరు చీటీలు పంచుతున్నారంటూ తెదేపా నేతలు అభ్యంతరం తెలిపారు. పోలీసులు సర్దిచెప్పడంతో సద్దుమణిగింది. 10 గంటల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వైకాపా ఛైర్మన్ అభ్యర్థిగా ఉన్న డాక్టర్ సుధీర్ పోటీచేస్తున్న వార్డులోకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని తెదేపా కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయినా వారు వదిలివేయడంతో సీఎంకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులును పోలీసులు అక్కడి నుంచి పంపించారు.
* తెదేపా తరఫున తనకు జనరల్ ఏజెంటుగా పాస్ ఇచ్చినప్పటికీ బూత్‌లోకి అనుమతించకపోవడంపై ఉర్దూ పాఠశాల వద్ద తెదేపా నేత గోపీనాథ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి భరత్, అభ్యర్థి సుధీర్ అక్కడికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఎంపీని కూడా లోనికి అనుమతించలేదు. తమ కార్యకర్తలను తెదేపా నేతలు అడ్డుకుంటున్నారని ఎంపీ ఆరోపించారు. మధ్యాహ్నం వరకు ముగ్గురూ అక్కడే మకాô వేశారు.
*మధ్యాహ్నం బస్టాండు సమీపంలో కృష్ణగిరి ప్రాంతానికి చెందిన బస్సును తెదేపా కార్యకర్తలు గుర్తించి, అందులోని మహిళలను ప్రశ్నించారు. తాము తిరుమల దర్శనానికి వెళ్తున్నట్లు చెప్పారు. దర్శన టోకెన్లు చూపించాల్సిందిగా కోరగా సమాధానం రాకపోవడంతో పోలీసులకు అప్పగించారు.
*బయటి నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చే వారిని నిరోధించడంలో పోలీసులు విఫలమయ్యారని పేర్కొంటూ తెదేపా కార్యాలయం ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ వద్ద కార్యకర్తలు ధర్నా చేశారు. పోలీసులు లాఠీఛార్జి చేసి పంపించారు. పోలింగ్ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరుతూ చంద్రబాబునాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఎస్‌ఈబీ జేడీ విద్యాసాగర్‌నాయుడి కాళ్లపై పడి వేడుకున్నారు.
లాఠీఛార్జిలో పలువురికి గాయాలు
విజయవాణి కళాశాలలో స్థానికేతర మహిళలను గుర్తించిన తెదేపా మహిళా నేతలు అనసూయ, చంద్రకళ అక్కడికి చేరుకున్నారు. దొంగ ఓట్లు వేసేందుకు సిగ్గులేదా అంటూ వారిపై చేయి చేసుకున్నారు. స్థానికేతరులను బయటకు పంపించి కళాశాల గేటుకు తాళాలు వేశారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీఛార్జి చేసి తరిమికొట్టారు. ఒకరు సొమ్మసిల్లి పడిపోగా మరికొందరికి గాయాలయ్యాయి. పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. అక్కడికి వచ్చిన గౌనివారి శ్రీనివాసులుతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఆయనను ఠాణాకు తరలించగా.. స్టేషన్‌లో కిందే కూర్చొని నిరసన తెలిపారు.
నెల్లూరులోనూ ఫిర్యాదుల వెల్లువ
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పోలింగ్ బూత్‌ల వద్ద వైకాపా అభ్యర్థులు ఓట్లు అభ్యర్థించడంపై తెదేపా నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. 9, 10, 49, 50 డివిజన్లలో కొందరు ఓటర్లు రెండోసారి ఓటు వేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు స్పందించలేదంటూ తెదేపా నాయకులు వాపోయారు. జెండా వీధిలోని పీఎన్‌ఎం హైస్కూల్ వద్ద తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి అబ్దుల్ అజీజ్‌ను వైకాపా నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 50వ డివిజన్‌లో పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి అనిల్‌కుమార్ తమ్ముడు ఉన్నా.. తమను మాత్రం ఎందుకు పంపిస్తున్నారంటూ కొందరు నిలదీశారు. 39వ డివిజన్‌లోని ఏడో పోలింగ్ కేంద్రంలో 300 దొంగ ఓట్లేశారని తెదేపా బూత్ ఏజెంట్ దయాకర్ ఆర్వోకు ఫిర్యాదు చేశారు. రీ పోలింగ్‌కు డిమాండ్ చేశారు. బుచ్చిరెడ్డిపాళెం 14వ వార్డులోనూ దొంగ ఓట్లపై భాజపా నాయకులు నిరసన తెలిపారు.
గురజాలలో ప్రశాంతం
గుంటూరు జిల్లాలోని గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురజాలలో 6 వార్డులు ఏకగ్రీవం కాగా, 14 వార్డులకు ఎన్నికలు జరిగాయి. దాచేపల్లిలో ఒక వార్డు ఏకగ్రీవం కాగా, 19 చోట్ల ఎన్నికలు నిర్వహించారు. దాచేపల్లి మూడో వార్డులో తెదేపా నేత, మాజీ సర్పంచి తంగెళ్ల శ్రీనివాసరావు, వైకాపా నాయకుడు పోలింగ్ కేంద్రం వద్ద వాదనకు దిగారు. పోలీసులు ఇద్దరికీ సర్దిచెప్పి బయటకు పంపారు. 8వ వార్డులో జనసేన, వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, పోలీసులు అక్కడినుంచి పంపించారు.
నకిలీ ఓటర్లను అప్పగించినా.. చర్యల్లేవు
దర్శి నగర పంచాయతీలో వైకాపా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ నిబంధనలు ఉల్లంఘించి, పోలింగ్ బూత్‌ల్లోకి వెళ్లారంటూ తెదేపా అధికారులకు ఫిర్యాదు చేసింది. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, కొండపి ఎమ్మెల్యే స్వామి, తెదేపా దర్శి ఇన్‌ఛార్జి పమిడి రమేష్‌లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐదో వార్డులో యాభైకి పైగా దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. 13వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్న వారిని రమేష్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొనగా డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి సిబ్బందితో వచ్చి చెదరగొట్టారు. 9, 15, 19, 20వ వార్డుల్లోనూ దొంగ ఓట్లు పోలయ్యాయని తెదేపా ఆరోపించింది.
కాకినాడలో నకిలీ స్లిప్పులతో పోలింగ్‌కు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ 16వ డివిజన్‌లో కొందరు దొంగ ఓట్లు వేయడానికి వచ్చారంటూ తెదేపా ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి 300 మంది వచ్చారంటూ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. 14వ డివిజన్ తెదేపా కార్పొరేటర్ ఉమాశంకర్ ఓ పోలింగ్ కేంద్రం వద్ద గుర్తింపు కార్డుల ఆధారంగా నకిలీ ఓటర్లను పసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైకాపాకు మద్దతుగా ఉన్న ఉపమేయర్-2 సత్యప్రసాద్‌తో తెదేపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇరుపార్టీల నేతల ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ భీమారావు ఆధ్వర్యంలో సిబ్బంది నాయకులను పంపించారు.
పోలింగ్ కేంద్రం కాదిది.. అభ్యర్థి ఇల్లు!
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ 45వ డివిజన్ ఎన్నిక సందర్భంగా వైకాపా అభÅ్యర్థి ఇలియాష్ పాషా ఇంటి వద్ద ఉదయం 8 నుంచే ఓటర్లు బారులుదీరారు. స్లిప్పుల పంపిణీ పేరుతో ఓటుకు రూ.1000 ముట్టచెప్పారని విపక్షాలు ఆరోపించాయి. తెదేపా ఏలూరు ఇన్‌ఛార్జి బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ పోలీసులే వైకాపా అభ్యర్థి ఇంటి వద్ద ఉండి ఓటర్లను లోనికి పంపిస్తున్నారని ఆరోపించారు. డబ్బుల పంపిణీపై వైకాపా నాయకుడు బలరామ్ మాటలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చేసినట్లు ఉన్నాంగా’ అని వైకాపా నాయకుడు అంటే.. ‘లేదండీ.. ఇప్పుడు ఇవ్వాలి’ అని మరో నాయకుడు చెప్పడంపై ఆడియో వైరల్ అయ్యింది. డబ్బులు ఎక్కడా పంచలేదని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ చెప్పారు.
ఇదీ చదవండి..