'చంద్రబాబు, దేవినేని ఉమా లాంటి వారి మాటలు విని ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూసేవాళ్లు.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని... తెదేపా ద్వితీయ శ్రేణి నాయకులను, ఉమా లాంటివారి వెనుక తిరిగేవారిని హెచ్చరిస్తున్నాం' అని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. ‘ఉమానే మంగళవారం ఉద్దేశపూర్వకంగా గ్రామానికి వెళ్లి అక్కడి ఎస్సీలను, ప్రజలను నోటికొచ్చినట్లు తిట్టారు. అడ్డువచ్చిన పోలీసులనూ దుర్భాషలాడి వారి విధులకు ఉమా, ఆయన అనుచరులు అడ్డుపడ్డారు. అక్కడ ఘటనలో పగిలింది వైకాపా వ్యక్తి కారు అద్దాలైతే అది ఉమా కారు అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు’ అని విమర్శించారు.
‘కొండపల్లి, ఇబ్రహీంపట్నం వద్ద 1972 నుంచే తవ్వకాలు జరుగుతున్నాయి. 40 ఏళ్లలో జరిగిన దానికంటే ఉమా మంత్రిగా ఉన్న 2014-19 మధ్య జరిగిన తవ్వకాలే ఎక్కువ. అక్కడి క్రషర్ల యజమానులు డబ్బు ఇవ్వలేదని ఉమానే అది అటవీ భూమి అని తప్పుడు ధ్రువీకరణ పత్రం సృష్టించి, తర్వాత డబ్బు వసూలు చేసుకుని మళ్లీ 2018లో అది అటవీ భూమి కాదని మైనింగ్ చేసుకోవచ్చని అప్పటి రెవెన్యూమంత్రి కేఈ కృష్ణమూర్తితో ఉత్తర్వులు ఇప్పించారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కంకర అమ్ముకుంటున్నారని ఉమా నిరాధారంగా మాట్లాడుతున్నారు. 2005లోనే రూ.450 కోట్లతో రాష్ట్రంలోనే పెద్ద స్పిన్నింగ్‌మిల్లు ఏర్పాటు చేయడంతోపాటు హైదరాబాద్‌లో పలు వెంచర్లు వేసిన వ్యక్తి కృష్ణప్రసాద్. 50 ఏళ్ల వయసు తర్వాతే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు కంకర అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? రెచ్చగొట్టి గొడవ సృష్టించేందుకు కారకులెవరో పూర్తిగా విచారణ జరిపి కేసులు పెట్టాలనే పోలీసులకు చెప్పాం. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా దాడికి కారకులపైనే కేసు పెట్టేందుకు పోలీసులు ముందుకొచ్చినందుకు పోలీసు శాఖను అభినందిస్తున్నాం - మంత్రి కొడాలి నాని
దాడి జరుగుతుంటే మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వగలరా
దేవినేని ఉమామహేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు.
‘ఉమాపై దాడి జరిగితే ఆయన కారులో దర్జాగా కూర్చుని మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వగలరా? వాళ్ల అరాచకాలను చూస్తూ ఊరుకోం. చంద్రబాబు, ఆయన మనుషులు ఇప్పటికైనా ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టాలి. అసలు అక్రమ క్వారీయింగ్ లేదని గ్రామస్తులే చెబుతుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలపైన దాడులు చేస్తారా? వారిని ఉమా, ఆయన అనుచరులు తిడితే ఊరుకుంటారా? మైలవరం నియోజకవర్గంలో గనులు, ఇసుక, మట్టి నుంచి బూడిద వరకు అన్నీ దోచుకుంది ఉమానే. అందువల్లే ఈ రోజు ఆయన అక్కడ కాలు పెడుతుంటే ప్రజలు వద్దంటున్నారు’ -వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్
వైకాపా నాయకుడి కారుపై ఉమానే దాడి చేయించారు: కృష్ణప్రసాద్
‘వైకాపా స్థానిక నాయకుడు పాలడుగు దుర్గాప్రసాద్ కారుపై దేవినేని ఉమానే దాడి చేయించి, తిరిగి తన కారుపై దాడి చేశారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు’ బుధవారం ఆయన మాట్లాడిన విషయాలను వైకాపా కేంద్ర కార్యాలయం మీడియాకు విడుదల చేసింది.
‘గ్రామాల్లో పరామర్శలకు వెళ్లిన వైకాపా స్థానిక నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టి వారిపై ఉమానే దాడి చేయిస్తే వారు జి.కొండూరు పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అక్కడ దుర్గాప్రసాద్ కారుపై దాడి చేయించడంతోపాటు డ్రైవింగ్ సీట్లో ఉన్న ఎస్సీ యువకుడు సురేష్‌పైనా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. పోలీసుస్టేషన్ సీసీటీవీ కెమెరాల్లోనూ ఈ ఫుటేజి రికార్డయింది. వాళ్లే తప్పు చేసి, సానుభూతి డ్రామాలు ఆడుతున్నారు’ - మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
ఇవీ చదవండి:
రాజమహేంద్రవరం జైలుకు దేవినేని ఉమా... 14 రోజులు రిమాండ్
arrest: అర్ధరాత్రి హైడ్రామా.. దేవినేని ఉమా అరెస్ట్
Devineni arrest: దేవినేని అరెస్ట్‌పై తెదేపా నేతల ఆగ్రహం
Devineni uma arrest: ఉద్దేశపూర్వకంగా ఘర్షణలు తలెత్తేలా వ్యవహరించారు: డీఎస్పీ శ్రీనివాసులు