కొత్తగా నియమితులైన ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం చేశారు. న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి ప్రమాణం చేయించారు. జస్టిస్ కన్నెగంటి లలితకుమారి, జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్తగా నియమితులైన వారితో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరింది.
ప్రభుత్వ నోటిఫికేషన్
హైకోర్టులో నూతన న్యాయమూర్తుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర న్యాయశాఖ జారీచేసిన నోటిఫికేషన్‌ను ఏపీ గెజిట్‌లో ప్రచురించాల్సిందిగా ఉత్తర్వులిచ్చింది.
న్యాయమూర్తుల నేపథ్యం
రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియమిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేశ్ రెడ్డి, కన్నెగంటి లలితకుమారిలను న్యాయమూర్తులుగా నియమించారు. వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదిస్తూ.. ఏప్రిల్ 20న కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్రం అంగీకారం తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ముగ్గురి నియామకాలతో... హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరింది.
జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్
బొప్పూడి కృష్ణమోహన్ ప్రస్తుతం హైకోర్టులో కేంద్రం తరఫు సహాయ సొలిసిటర్ జనరల్‌గా పని చేస్తున్నారు. ఆయన గుంటూరు జిల్లా బొప్పూడిలో 1965 ఫిబ్రవరి 5న జన్మించారు. 1988లో ఆంధ్రా క్రిస్టియన్ న్యాయకళాశాలలో... న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. గతంలో హోంశాఖ ఏజీపీగానూ, కేంద్ర సంస్థలకు న్యాయవాదిగానూ... కేంద్రానికి ప్యానల్ న్యాయవాదిగా సేవలు అందించారు. ఉమ్మడి హైకోర్టు విభజన తర్వాత... గతేడాది జనవరిలో హైకోర్టుకు తొలి సహాయ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు.
జస్టిస్ కంచిరెడ్డి సురేశ్ రెడ్డి
కంచిరెడ్డి సురేశ్ రెడ్డి స్వస్థలం అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెల. అనంతపురం ప్రభుత్వ కళాశాలలో బీఏ చదివారు. కర్ణాటకలోని గుల్బర్గా వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1989లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. క్రిమినల్ 'లా'లో ప్రావీణ్యం సాధించి మంచి పేరు గడించారు. సివిల్, రాజ్యాంగ సంబంధిత కేసులను వాదించిన అనుభవమూ ఉంది.
జస్టిస్ కన్నెగంటి లలితకుమారి
గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువుజమ్ములపాలెంకు చెందిన కన్నెగంటి లలితకుమారి....1971 మే 5న జన్మించారు. విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది. పడాల రామిరెడ్డి న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని... హైకోర్టు న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. సివిల్, క్రిమినల్ కేసులు సహా... రాజ్యాంగ, సర్వీసు సంబంధిత కేసులు వాదించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ, హైదరాబాద్‌లోని ఇంగ్లీష్, ఫారిన్ ల్యాంగ్వేజెస్ కేంద్ర విశ్వవిద్యాలయం-ఇఫ్లూ, దేవదాయశాఖ, తితిదే, శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు. ప్రస్తుతం తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠం కేంద్ర విశ్వవిద్యాలయానికి స్టాండిగ్ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి : లాక్ డౌన్ వేళ.. 'పునుకుల' కట్టుబాటు భేష్!