AP HIGH COURT: మాదక ద్యవ్యాల నిరోధక చట్టం కింద నమోదవుతున్న నేరాలు సమాజంపై ప్రభావం చూపుతాయని హైకోర్టు(ap high court on ganja cases) తెలిపింది. ఎన్డీపీఎస్(NDPS) చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రాష్ట్ర డీజీపీ క్రమం తప్పకుండా ప్రత్యేక విభాగంతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని స్పష్టంచేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సంప్రదింపులు జరుపుతుండాలని పేర్కొంది . ఏపీలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ విస్తీర్ణంలో గంజాయి సాగుచేస్తున్నట్లు కనిపిస్తోందని... ఇది చట్ట విరుద్ధమని , కేసు నమోదు అయితే బెయిలు పొందడం అంత సులువుకాదనే విషయం అక్కడి వారికి తెలియదని వ్యాఖ్యానించింది. ఆ ప్రాంతాల్లో పోలీసులు అవగాహన శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరచాలని ఆదేశించింది.
అలాగే వారికి ఉపాధి మార్గాలు కల్పించే అంశాన్ని అన్వేషించాలని స్పష్టం చేసింది. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో పోలీసులు, ప్రత్యేక కోర్టుల న్యాయాధికారులు, పీపీలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను నిర్దేశిస్తూ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఇటీవల కీలక తీర్పు ఇచ్చారు. సంబంధిత ప్రతి... హైకోర్టు వెబ్సెట్లో అందుబాటులో ఉంది . ఎన్డీపీఎస్ కింద విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితులైన లారీ డ్రైవర్, క్లీనర్‌కు బెయిల్ మంజూరు చేశారు.
ఎన్టీపీస్ చట్టం కింద నమోదైన కేసుల్లో(ap high court on ntps act) అభియోగపత్రం 180 రోజుల్లో దాఖలు చేయకపోతే నిందితులకు డిఫాల్డ్ బెయిలు మంజూరు చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. 180 రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేయలేనప్పుడు .. నిందితుల రిమాండ్ సమయాన్ని పొడిగించాలని పోలీసులు సంబంధిత కోర్టులో దరఖాస్తు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. నిందితుల రిమాండ్ సమయం పొడిగించాలని దిగువ కోర్టుల్లో దరఖాస్తులు చేయడం లేదనే విషయాన్ని ఉత్తర్వుల ఆధారంగా డీజీపీ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటికి చర్యలు లేవని న్యాయమూర్తి తప్పుపట్టారు.
క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు సూచన చేశామని డీజీపీ కౌంటర్‌లో తెలిపారు. ఎన్టీపీఎస్ కేసుల దర్యాప్తు విషయమై సమావేశాలు నిర్వహించి మార్గదర్శకం చేశామన్నారు. నిందితుల రిమాండ్‌ను పొడిగించాల్సినవి విజయనగరం జిల్లాలో 8, విశాఖ జిల్లాలో 44 ఎన్డీపీఎస్ కేసులున్నాయన్నారు. సమయం పొడిగింపునకు కోర్టులో మెమోలు వేశామన్నారు. 2020లో విశాఖ జిల్లాలో 252, 2021లో 248 ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు అయ్యాయన్నారు. కేసు మూలాలను కనుగొనలేక కొన్నింట్లో పోలీసులు అభియోగపత్రం దాఖలు(ap high court on ntps act) చేయలేకపోతున్నారన్న న్యాయమూర్తి.. కేసు నమోదు అయిన తర్వాత సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును పూర్తిచేయాలన్నారు. సోదాలు, జప్తులు చేసే సమయంలో అధికారులు ఎన్డీపీఎస్ చట్ట నిబంధనలను, సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను తప్పకుండా పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. నిందితుల రిమాండ్‌ను పొడిగించాలని పోలీసు అధికారులు కోరినా తగిన సమయంలో స్పందించిన పీపీ లేకుంటే ఏపీపీలపై చర్యలు తీసుకోవాలన్నారు.
అక్కడ బెయిలు పిటిషన్లపై జాప్యం..!
రిమాండ్ పొడిగింపు పిటిషన్లను ప్రత్యేక కోర్టులు నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని పేర్కొన్నారు. తరుచూ వాయిదాలతో నిందితులు 200 రోజులకు పైగా జైళ్లలో మగ్గుతున్నారన్నారు. విశాఖలోని ప్రత్యేక కోర్టులో బెయిలు కోసం వేసిన పిటిషన్లకు 10 నుంచి 15 రోజులకు నంబరు ఇస్తున్నట్లు హైకోర్టు దృష్టిలో ఉందన్న న్యాయమూర్తి... 2021 సెప్టెంబర్ నుంచి నవంబర్ 1 మధ్య బెయిలు పిటిషన్లు ఎప్పుడు దాఖలయ్యాయి, వాటికి నంబరు ఎప్పుడు కేటాయించారు.. విచారణకు ఎప్పడొచ్చాయి.. న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఎప్పుడు జారీచేసిందనే వివరాలతో విశాఖలోని ఎన్డీపీఎస్ కేసుల విచారణ ప్రత్యేక జడ్జి.. హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు.
- ఇదీ చదవండి:
TDP PARLIAMENTARY PARTY MEETING: 'రాష్ట్రంలోని వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి'