High court On Cinema Theater locked issue: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని.. సినిమా థియేటర్‌కు ఓ తహసీల్దార్ తాళం వేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆ అధికారం తహశీల్దార్‌కు లేదని స్పష్టం చేసింది. లైసెన్స్ జారీ చేసే అధికారం ఉన్న సంయుక్త కలెక్టర్.. అధికారమిచ్చిన వ్యక్తికి మాత్రమే తాళం వేసే అధికారం ఉంటుందని తెలిపింది. ప్రస్తుత విషయంలో సంయుక్త కలెక్టర్.. తహసీల్దార్‌కు ఆ అధికారం ఇవ్వలేదని గుర్తుచేసింది. థియేటర్‌ను తెరవాలని తహసీల్దార్‌ను న్యాయస్థానం ఆదేశించింది. లెసైన్స్ పునరుద్ధరణ వ్యవహారం అధికారుల వద్ద ఉన్న నేపథ్యంలో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల ఈమేరకు ఉత్తర్వులిచ్చారు.
విజయనగరం జిల్లా సోంపేటలోని శ్రీనివాస మహల్‌ను తహశీల్దార్ మూసివేయడాన్ని సవాలు చేస్తూ.. మేనేజింగ్ పార్టనర్ ఎస్.శంకరరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ వ్యవహరించారని చెప్పారు. ఆ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. థియేటరుకు వేసిన తాళాన్ని తీయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
ఇదీ చదవండి: