రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్‌కు సంబంధించిన వ్యాజ్యాలపై.... నేరుగా విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. సోమవారం 2 పక్షాల న్యాయవాదులు కోర్టుకు హాజరై భౌతికదూరం పాటిస్తూ వాదనలు వినిపించాలని ఆదేశించింది. వ్యాజ్యాలతో సంబంధం ఉన్న ఏపీ, తెలంగాణలోని న్యాయవాదులకు.. పాసులు ఇచ్చి హైకోర్టుకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని... ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల డీజీపీలకు తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం తెలిపింది.
ఆర్డినెన్స్‌ను సవాలు చేయొచ్చు
ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వేసిన వ్యాజ్యం సహా మరో 11 పిటిషన్లు దాఖలయ్యాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై హైకోర్టు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆర్డినెన్స్ సవాలు చేసే హక్కు ప్రజలకు ఉంటుందని ఓ పిటిషనర్ తరఫు న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు. ఈ తరహాలో ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వివరించారు.
రంగులు తొలగించాకే ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రస్తుత ఎస్ఈసీ జస్టిస్ కనగరాజ్ చర్యలను నిలువరిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని ధర్మాసనాన్ని రమేశ్ కుమార్ తరఫు న్యాయవాది డీవీ సీతారామమూర్తి కోరారు. లాక్‌డౌన్ ముగిశాక 3 వారాల్లోగా ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులను తొలగించాకే ఎన్నికలు కొనసాగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు..ధర్మాసనం గుర్తుచేసింది. రంగులు తొలగించకుండాఎన్నికలు నిర్వహించలేరని స్పష్టం చేసింది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే జోక్యం చేసుకుంటామని తెలిపింది.
వాదనలు కొనసాగుతుండగా విచారణకు అనేకసార్లు ఆటంకం కలగడం వల్ల... న్యాయవాదుల అభ్యర్థనతో సోమవారం నేరుగా విచారణ జరపడానికి ధర్మాసనం నిర్ణయించింది.
ఇదీ చదవండి : 'రమేశ్‌కుమార్‌ను ప్రభుత్వం తొలగించలేదు'