హైకోర్టులో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నందువల్ల రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు పురపాలక శాఖ కమిషనర్ చర్యలు తీసుకోరని అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఈ వ్యాజ్యాలపై వేసవి సెలవుల తర్వాత విచారణ జరపాలని కోరారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తరఫు న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. పురపాలకశాఖ కమిషనర్ నుంచి ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి రానంతవరకూ తామూ నిర్వహణ చర్యలు చేపట్టలేమన్నారు. న్యాయవాదులు చెప్పిన వివరాల్ని నమోదు చేసిన ధర్మాసనం.. వ్యాజ్యాలపై విచారణను జూన్ మూడో వారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేస్తూ గతేడాది డిసెంబరు 31న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్‌గా జీవో..
పిటిషనర్ల తరఫున కొందరు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. రాజధాని అమరావతి పరిధిలోని కొన్ని గ్రామాలను మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలలో విలీనం చేసి, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి ‘మున్సిపల్ కార్పొరేషన్’గా పేర్కొంటూ ప్రభుత్వం తాజాగా జీవో ఇచ్చిందన్నారు. వార్డుల విభజనకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసిందన్నారు. రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహిస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. దాంతో, ఎన్నికల నిర్వహణపై వైఖరి తెలపాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది, ప్రభుత్వం తరఫున ఏజీని ధర్మాసనం కోరింది. వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్న కారణంగా ఎన్నికల నిర్వహణకు పురపాలకశాఖ కమిషనర్ చర్యలు తీసుకోలేరని ఏజీ స్పష్టత ఇచ్చారు. వేసవి సెలవుల తర్వాత విచారణ జరపాలని, ఈలోపు వార్డుల పునర్విభజన తదితర ప్రక్రియలకు వెసులుబాటు ఇవ్వాలన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు చేస్తారేమోనని ఆందోళన వ్యక్తంచేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆర్డినెన్స్‌ను రద్దుచేస్తే వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ మొత్తం రద్దు అవుతుందని తెలిపింది. విచారణను జూన్ మూడో వారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి