కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు గైర్హాజరవడంపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లత్కర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయనపై బెయిలబుల్ వారెంట్(బీడబ్ల్యూ) జారీచేసింది. విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. కొవిడ్ కేసుల నేపథ్యంలో అధికారిక బాధ్యతలు నిర్వహించాల్సి ఉందని, హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కలెక్టర్ వేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం, తోటాడ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 121లో 70 సెంట్ల స్థలాన్ని భూముల రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ.. బి.నాగేశ్వరావు, మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషనర్ సమర్పించిన వినతిని పరిగణనలోకి తీసుకొని 8 వారాల్లో చట్ట ప్రకారం నిర్ణయించాలని గతేడాది మే 3న కలెక్టర్‌ను ఆదేశించింది.
అయితే.. కోర్టు ఆదేశించినా సుధీర్ఘ కాలంపాటు కలెక్టర్ నిర్ణయం తీసుకోకపోవడంతో పిటిషనర్లు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను జనవరి 7న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది సువ్వారి శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. గత విచారణలో కలెక్టర్ హాజరును న్యాయస్థానం ఆదేశించిందన్నారు. రెవెన్యూశాఖ జీపీ సుభాష్ స్పందిస్తూ.. హాజరు నుంచి మినహాయింపు కోసం కలెక్టర్ అనుబంధ పిటిషన్ వేశారన్నారు. అధికారిక పనుల కారణంగా హాజరు కాలేకపోయారన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన న్యాయమూర్తి కలెక్టర్‌కు బెయిలబుల్ వారెంట్(బీడబ్ల్యూ) జారీ చేశారు.
ఇదీ చదవండి: