ప్రభుత్వ భూముల వేలాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా.... హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. మనసును తొలచిన దాన్ని బహిరంగంగా ప్రశ్నించడం తనకు అలవాటని.... దానిపై స్పష్టత ఇస్తే సరిపోతుందన్నారు. అంతే తప్ప దాన్ని దృష్టిలో ఉంచుకుని పిటిషన్లు వేయడం సరికాదన్నారు. 1983 నుంచి న్యాయవాదిగా 26 ఏళ్లకుపైగా ప్రాక్టీసు చేశానని.... 2009లో హైకోర్టు జడ్జిగా నియమించినప్పటి నుంచి శక్తిసామర్థ్యాల మేరకు విధులు నిర్వహిస్తున్నానని చెప్పారు. పాట్నా హైకోర్టులో జడ్జిగా పనిచేసినప్పుడు... వాదనలు వినిపించేవారు సీనియర్ న్యాయవాదా..జూనియరా అనే వ్యత్యాసం ఎన్నడూ చూపలేదన్నారు. కారణం ఏదైనా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానని.... పదవీ విరమణకు ముందు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నానని ఆవేదన చెందారు. ఏదేమైనా ఊపిరి ఉన్నంత వరకు న్యాయ వ్యవస్థను కాపాడతానని స్పష్టం చేశారు.
బరువెక్కిన హృదయంతోనే పిటిషన్: ఏఏజీ
ఈ వ్యాజ్యాలపై వాదనలు వినిపించిన అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి... విచారణ నుంచి తప్పుకోవాలంటూ బరువెక్కిన హృదయంతో ప్రభుత్వం తరఫున అనుబంధ పిటిషన్ వేశామన్నారు. వేసిన అధికారి కేడర్ ఏంటని ధర్మాసనం ప్రశ్నించగా... మిషన్ బిల్డ్ ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఐఎఎస్ అధికారని తెలిపారు. పదవీ విరమణ తర్వాత ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారా అని అడగ్గా... యువ ఐఎఎస్ అని ఏఏజీ తెలిపారు. ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బాధ్యతలు నిర్వహించకుండా... కొందరు వ్యాజ్యాలు వేసి అడ్డుకుంటున్నారని వాదించారు. ఏ ప్రభుత్వమైనా ప్రజాతీర్పుతోనే అధికారంలోకి వస్తుందన్న ధర్మాసనం.... ప్రజలు పూర్తిస్థాయిలో మ్యాండేట్ ఇస్తే న్యాయవ్యవస్థ విధులు నిర్వహించాల్సిన అవసరం లేదనుకుంటున్నారా..? అని ప్రశ్నించింది. ప్రజలందరి బాగోగులు మేమే చూసుకుంటామని, ఎలాంటి పిటిషన్లయినా దాఖలు చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని చెప్పాలనుకుంటున్నారా అని ధర్మాసనం అడగ్గా.... లేదని ఏఏజీ బదులిచ్చారు.
ఈ నెల 11న జస్టిస్ రమేశ్‌తో బెంచ్ నిర్వహించానని... ఆ బెంచ్‌లోనే ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్ (ఐఏ)ని విచారించడం సమంజసమని జస్టిస్ రాకేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం వేసిన ఐఏపై విచారణ అవసరం లేదని... పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన నళిన్‌కుమార్ అన్నారు. దీనిపై జస్టిస్ రాకేశ్‌కుమార్ ఒక్కరే నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ప్రభుత్వ అభ్యర్థనలను అనుమతిస్తే అలజడికి కారణమవుతాయన్నారు. ప్రస్తుత ధర్మాసనం ముందు వ్యాజ్యాల విచారణ వద్దంటూ, నచ్చిన బెంచ్‌ను ఎంచుకునేందుకు ప్రభుత్వాన్ని అనుమతించొద్దని... మరో న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదించారు. తామేమీ నచ్చిన ధర్మాసనాల్ని ఎంచుకోవడం లేదని... పిటిషనర్ల తీరే అలా ఉందని ఏఏజీ అన్నారు.
ప్రభుత్వ అభ్యర్థన అనుమతిస్తే న్యాయవ్యవస్థలో దుష్ట సాంప్రదాయానికి తావిచ్చినట్లు అవుతుందని... పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది ప్రసాదబాబు వాదించారు. న్యాయవాదులు, నేరుగా వాదనలు చెప్పేవాళ్లు తప్ప ఇతరులెవరూ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణలోకి లాగిన్ కావడానికి వీల్లేదన్నారు. రోష్టర్ నిబంధనలు చదివి వినిపించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో లాగినై కోర్టు విచారణను పరిశీలించానని ఐఎఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ అఫిడవిట్లో పేర్కొన్నారని... అక్రమంగా లాగిన్ అయినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై విచారణ జరపడం లేదన్న ధర్మాసనం... ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్ పై పిటిషనర్లు ఈ నెల 23లోపు కౌంటర్లు వేయాలని ఆదేశించింది. హైకోర్టు సీజే నిర్ణయం మేరకు జస్టిస్ రమేశ్‌తో ఈ నెల 28న బెంచ్ ఏర్పాటు చేస్తే... ఐఏ పై విచారణ జరుపుతామని జస్టిస్ రాకేశ్‌కుమార్ చెప్పారు. ఫైళ్లను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
ఇదీ చదవండి
యువకుడు హల్చల్.. మూడంతస్థుల భవనం పైనుంచి దూకుతానని బెదిరింపు