అమరావతి రాజధాని వ్యాజ్యాలపై ఆరో రోజూ హైకోర్టు విచారణ జరిపింది. 3 రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది(ap high court repeal the three-capital bill). వివరాల సమర్పణకు కొంత సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ కోర్టును కోరారు. శుక్రవారంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
తెదేపా ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తరఫు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తుండగా.. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ సీఆర్డీఏ రద్దు , పాలన వికేంద్రీకరణ చట్టాలను ' రద్దు ' చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని కోర్టుకు తెలిపారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటన చేయబోతున్నారన్నారు. బిల్లుతోపాటు సంబంధిత వివరాలను మధ్యాహ్నం 2.15 గంటలకు తెలియజేస్తానన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
2.15 గంటలకు జరిగిన విచారణలో ఏజీ స్పందిస్తూ .. ముఖ్యమంత్రి ఇంకా ప్రకటన చేయలేదని.. మరో అరగంట సమయం పట్టే అవకాశం ఉందన్నారు. బిల్లుతో పాటు ఇతర వివరాలను మెమో రూపంలో కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని కోరారు. ' రాజధాని రైతు పరిరక్షణ సమితి ' తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ స్పందిస్తూ.. బిల్లులో ఏముందో తదితర వివరాలను పరిశీలించి స్పందించాల్సి ఉందన్నారు. విచారణను తక్కువ రోజులకు వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు.. ఉన్నం మురళీధరరావు , పీబీ సురేశ్ , కేఎస్ మూర్తి , వాసిరెడ్డి ప్రభునాథ్ తదితరులు విచారణను త్వరలోనే చేపట్టాలని కోరారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం లేదని మంత్రి ఒకరు మీడియాతో మాట్లాడారన్నారు. ప్రభుత్వం న్యాయస్థానాలను శాసిస్తోందన్నారు. ఏజీ చెబుతున్నదాంట్లో స్పష్టత లేదన్నారు. మరో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ స్పందిస్తూ .. రాజధాని వ్యాజ్యాలపై విచారణను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇది ఇంటర్వెల్ మాత్రమ..శుభం కార్డు కాదు అని ఓ మంత్రి వ్యాఖ్యానించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం మెమో దాఖలు చేయడం ఒక్కటే సరిపోదన్నారు. ఆ చట్టాలను రద్దు చేస్తూ తాజాగా బిల్లు తీసుకురావడానికి గల కారణాలతో అఫిడవిట్ వేసేలా ఆదేశించాలని కోరారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న త్రిసభ్య ధర్మాసనం .. శుక్రవారంలోపు అఫిడవిట్‌తో పాటు మెమో , సంబంధిత బిల్, దానిని ప్రవేశపెట్టడానికి గల కారణాలు, ఉద్దేశాలను కోర్టులో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఆర్థిక మంత్రి ఇప్పుడే బిల్లును సభలో ప్రవేశపెట్టినట్లు సమాచారం అందిందని ఏజీ తెలిపారు.
సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తూ .. సీఆర్డీఏ రద్దు , పాలన వికేంద్రీకరణ బిల్లులను శాసన మండలి ఛైర్మన్ .. సెలక్ట్ కమిటీకి సిఫారసు చేశారన్నారు. ఛైర్మన్ ఆదేశాలను భేఖాతరు చేస్తూ కార్యదర్శి కమిటీని ఏర్పాటు చేయలేదన్నారు. బిల్లులను పాస్ చేసే క్రమంలో ప్రభుత్వం సభా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. తన వాదనకు బలం చేకూరేలా న్యాయస్థానాలు గతంలో ఇచ్చిన తీర్పులను కోర్టుకు సమర్పించారు.
ఇదీ చదవండి:
AP cabinet News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ