రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు కచ్చితంగా అందుబాటులో ఉంచాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. కొన్ని చోట్ల ఓపీ సేవలు అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్న ఆయన.. ఓపీ సేవలు నిలిపేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సచివాలయంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించినట్లు మంత్రి వివరించారు. కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెంచాలని సీఎం ఆదేశించారన్న మంత్రి.. ఇప్పటివరకు 87,086 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించినట్లు వెల్లడించారు.
మరిన్ని వివరాలు
- సీఎం సూచన మేరకు అన్ని జిల్లాల్లో కొవిడ్ ఆస్పత్రులు.. క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాలు పెంచుతాం.
- టెలి మెడిసిన్ సదుపాయంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తాం.
- ఇతర రాష్ట్రాల్లోని ఏపీ వాసులను రప్పించేందుకు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి త్వరలోనే ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం.
- ఆర్టీ పీసీఆర్ ద్వారా వచ్చే ఫలితాలే తుదిగా పరిగణిస్తాం.
- కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.
- గుజరాత్ నుంచి మన ప్రాంతానికి చెందిన మత్య్సకారులు వస్తున్నారు. వలస కార్మికులు గ్రీన్‌జోన్ నుంచి గ్రీన్‌జోన్‌కు వెళ్లే అంశంపై వెసులుబాటు కల్పించాం.
అనుకోకుండా వచ్చిన విపత్తును ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి.. లాక్‌డౌన్ తర్వాత కూడా ప్రజలు భౌతికదూరం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి..