ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు మొత్తం రూ.1,500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.1,100 కోట్లు చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉందని, అవి వచ్చాక మిగిలిన రూ.400 కోట్లను చెల్లిస్తామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన బిల్లుల పరిశీలన అనంతరం ఉపాధి నిధులు సుమారు రూ.1100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెలాఖరులోపు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. ఈ వివరాల్ని నమోదు చేసిన ధర్మాసనం విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. వివరాలు కోర్టు ముందుంచాలని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
మూడేళ్ల పనులపై వ్యాజ్యాలు..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2017, 2018, 2019 సంవత్సరాల్లో చేపట్టిన పనులు, ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన కోసం నిర్మాణ సామగ్రి (మెటీరియల్ కాంపోనెంట్) నిమిత్తం చేసిన ఖర్చుల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదంటూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. న్యాయస్థానం ఆదేశాల మేరకు బుధవారం జరిగిన విచారణకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ హాజరయ్యారు. వీరికి తదుపరి విచారణకు హాజరు నుంచి కోర్టు మినహాయింపు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్ వాదనలు వినిపిస్తూ.. రూ.5 లక్షల్లోపు విలువ చేసే ఉపాధి పనులకు రూ.415 కోట్లు గతంలోనే చెల్లించామన్నారు. రూ.5 లక్షలు దాటిన పనులకు రూ.715 కోట్లు ఇటీవల చెల్లించామని, ఇంకో రూ.400 కోట్లు బకాయి ఉందన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పి.వీరారెడ్డి, దమ్మాలపాటి శ్రీనివాస్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. 60 శాతం పెండింగ్ బిల్లులకు మాత్రమే చెల్లింపులు జరిగాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం జమ చేసిన సొమ్మును సర్పంచులు గుత్తేదారులకు చెల్లించడం లేదని చెప్పారు. ఎస్‌జీపీ బదులిస్తూ.. సొమ్ము జమ చేశాక వారం రోజుల్లో గుత్తేదారులకు చెల్లించకపోతే సర్పంచులపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఉత్తర్వులిచ్చామన్నారు.
ఇదీ చదవండి: HIGH COURT : 'దేవాదాయ చట్ట నిబంధనలను జీవోలు ఉల్లంఘిస్తున్నాయి'