రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా తనను తప్పించడం చట్ట విరుద్ధమంటూ.. ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ద్వివేది ఈ కౌంటర్ వేశారు. తనను తొలగించేందుకే ఆర్డినెన్స్ తెచ్చారన్న నిమ్మగడ్డ ఆరోపణలను ఖండిస్తున్నామని ద్వివేది అన్నారు. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకే ఆర్డినెన్స్ తెచ్చామన్న ద్వివేది... నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చేసిన ఆరోపణలేవీ నిజం కావని చెప్పారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం పంచాయతీరాజ్ చట్టంలోనూ సవరణ చేశామని ద్వివేది కౌంటర్లో పేర్కొన్నారు.
ఎన్నికల కమిషనర్ పదవీకాలం నిర్ణయించే అధికారం గవర్నర్‌కు ఉందని ద్వివేది స్పష్టం చేశారు. గవర్నర్ ఆమోదించాకే ఆర్డినెన్స్ తెచ్చామన్న ద్వివేది... ఈ విషయంలో ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదన్నారు. ఎన్నికల కమిషనర్ సర్వీసు రూల్స్ అన్నీ హైకోర్టు జడ్జి స్థాయిలో ఉండాలనే చట్టానికి సవరణలు చేశామని కౌంటర్లో ద్వివేది పేర్కొన్నారు. 2000 సంవత్సరం తర్వాత అధికారులతో నిర్వహించిన ఎన్నికల్లో ఇబ్బందులొచ్చాయని ప్రమాణ పత్రంలో తెలిపామని వివరించారు. ఆర్టికల్ 243 ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీకాలానికీ, సర్వీస్ రూల్స్ విడిగా చూడాల్సిందేనని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై తమను సంప్రదించలేదని కౌంటర్‌లో కోర్టు తెలియజేశారు.
కరోనా విషయంలో నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని సంప్రదించలేదన్న ద్వివేది... ఎన్నికలు వాయిదా పడినా కోడ్ కొనసాగుతుందని ప్రకటించడం సరికాదన్నారు. ఒడిశా, మహారాష్ట్ర, బంగాల్‌లో స్థానిక ఎన్నికల వాయిదా పరిస్థితులను అపిడవిట్‌లో పేర్కొన్నారు. ఏపీ స్థానిక ఎన్నికల వాయిదాతో మిగతా రాష్ట్రాలకు పోలిక లేదని కౌంటర్లో స్పష్టం చేశారు. ఎన్నికల వాయిదా తర్వాత నిమ్మగడ్డ చేపట్టిన చర్యలు సరికాదన్న ద్వివేది... ఆర్డినెన్స్ రాజ్యాంగ పరిధిలోనే ఉన్నందున ఆయన వేసిన పిటిషన్ తిరస్కరించాలని కోర్టును కోరారు.
ఇదీ చదవండి: