కరోనా బారినపడి ఆసుపత్రులు, క్వారంటైన్ లో ఉండి కోలుకున్న వారికి 'ఆసరా' కింద ఇచ్చే 2వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నిలిపేసింది. పాజిటివ్ కేసుల పెరుగుదలతో ఆర్థికభారం పెరిగినందున ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలికంగా ఈ సాయాన్ని నిలిపేసినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. సీఎం జగన్ ఏప్రిల్ నెలాఖరులో కరోనా రోగులకు 2వేల రూపాయల ఆర్థికసాయం చేస్తామని ప్రకటించగా... ఇప్పటివరకు బాధితులకు 20 కోట్ల రూపాయల వరకు చెల్లించారు.
జులై నుంచి డిశ్చార్జ్ అయిన వారి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుంటున్నా డబ్బులు మాత్రం సరిగ్గా జమ చేయడం లేదు. కరోనా సాయం ఇవ్వడం లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ చెప్పినట్లు అక్కడి సమాచార శాఖ అధికారులు ఇటీవల ప్రకటన జారీ చేశారు. బాధితులకు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో నాణ్యత కలిగిన భోజనం పంపిణీ చేయడం, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచడం, ఇతర సౌకర్యాల కల్పన కోసం అధిక వ్యయమవుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వైరస్ తో మరణించిన వారి మృతదేహాలకు ప్రభుత్వం ద్వారా ఖననం జరిగితే వారి కుటుంబాలకు ఇస్తున్న 15 వేలను సైతం ఇవ్వడంలేదు. మృతదేహాలను బాధితులు స్వయంగా ఖననం చేస్తేనే సాయం చేస్తామని పలు చోట్ల ఆసుపత్రుల అధికారులు చెబుతున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి