night curfew in ap:రాష్ట్రంలో నేటి నుంచి తలపెట్టిన రాత్రి కర్ఫ్యూ వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత.. ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. కర్ఫ్యూపై తొలుత ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేస్తూ.. తాజాగా ఆదేశాలను జారీ చేసింది.
minister alla nani on night curfew : సంక్రాంతి పండుగ వేళ పల్లెలకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారని.. వారికి ఇబ్బందులు కలగకూడదనే కర్ఫ్యూ వాయిదా వేశామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. మూడోదశ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలన్న ఆయన.. మాస్కులు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని చెప్పారు. కరోనా కట్టడిలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
వాణిజ్య దుకాణాలు, మాల్స్ తదితర వాటిల్లో కొవిడ్ నిబంధనలు పాటించకపోతే రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమా హాళ్లలో 50 శాతం మందికే అనుమతించింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పలు రంగాలకు మినహాయింపు
రాత్రి కర్ఫ్యూ నుంచి పలు రంగాలకు సర్కార్ మినహాయింపు ఇచ్చింది. ఇందులో ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బంది, ఔషధ దుకాణాలు, ప్రసార మాధ్యమాలు, టెలికమ్యూనికేషన్లు, ఐటీ సేవలతో పాటు విద్యుత్, పెట్రోల్ బంకుల సిబ్బంది , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు ఉన్నాయి. విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
భారీగా కరోనా కేసులు..
Corona cases in AP: మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24గంటల్లో.. 24,280 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,831 కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో..7,195 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 242 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
చిత్తూరులో అత్యధిక కేసులు..
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 467 కరోనా కేసులు నమోదు కాగా.. విశాఖ జిల్లాలో 295, కృష్ణా జిల్లాలో 190 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 164, అనంతపురంలో 161, నెల్లూరులో 129, శ్రీకాకుళం జిల్లాల్లో 122 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి
CM Jagan: మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేరబోతుంది: సీఎం జగన్