CM on Red sandalwood sales: ఆదాయ మార్గాల కోసం వేర్వేరు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్న రాష్ట్రప్రభుత్వం అప్పులతో పాటు వివిధ వనరులను కూడా తెగనమ్మి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే ఆదాయార్జన శాఖలపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ ఎర్రచందనం విక్రయాల పై కూడా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు తిరుపతి, రాజంపేట తదితర ప్రాంతాల్లోని అటవీశాఖ సెంట్రల్ స్టోర్స్ లో నిల్వ ఉంచిన ఎర్ర చందనం దుంగల నిల్వల్ని లాట్ల వారీగా వేలం వేసేందుకు అటవీ శాఖ సిద్ధం అవుతోంది. అక్టోబరు నుంచి 2023 మార్చి వరకూ దాదాపుగా 2640 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తిరుపతి, రాజంపేట, కడప తదితర ప్రాంతాల్లోని సెంట్రల్ రెడ్ సాండర్స్ డిపోల్లో సైజుల వారీగా దుంగల ను నిల్వ ఉంచారు. వీటన్నిటినీ ఎంఎంటీసీ ద్వారా అంతర్జాతీయ వేలం నిర్వహించి విక్రయించాలన్నది ప్రభుత్వ ఆలోచన. తద్వారా దాదాపు గా 3 వేల కోట్ల రూపాయల రెవెన్యూను ఆర్జించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. విడతల వారీగా ఈ ఎర్రచందనం దుంగల్ని విక్రయించేందుకు అనువుగా ఇప్పటికే ఎంఎస్టీసీ పోర్టల్ ద్వారా ఇ-బిడ్డింగ్ లను కూడా ఆహ్వానించారు. ప్రస్తుతం ఎర్రచందనం విక్రయాలకు సంబంధించి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి కూడా అనుమతులు రావటంతో ఎగుమతులకు అవకాశం ఏర్పడింది.
వాస్తవానికి స్మగ్లర్లు నరికిన ఎర్రచందనం దుంగలను ఇప్పటికే టాస్క్ ఫోర్సు కార్యాలయం తో పాటు కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి తదితర జిల్లాల పోలీసు స్టేషన్లలో భద్రపరిచారు. వీటన్నిటినీ రెడ్ సాండర్స్ సెంట్రల్ స్టోర్స్ కు తరలించి విక్రయానికి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఏపీ ఫారెస్టు డెవలప్మెంట్ కార్పోరేషన్ కేంద్రప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టీసీ ద్వారా చైనా లాంటి దేశాలకు ఈ నిల్వల్ని విక్రయించాల్సి ఉంది. చైనా, జపాన్, థాయ్ లాండ్ , మలేసియా లాంటి దేశాల్లో ఎర్రచందనానికి మంచి గిరాకీ ఉంది. 2021 ఏప్రిల్ లోనూ 318.447 టన్నుల ఎర్ర చందనాన్ని ఇ-ఆక్షన్ ద్వారా విక్రయించారు. ప్రస్తుతం ఏపీ అటవీశాఖ సెంట్రల్ స్టోర్స్ లో 5,700 టన్నులకు పైగా ఎర్ర చందనం దుంగలు నిల్వ ఉన్నాయి. ఏ- గ్రేడ్ క్వాలిటీకి చెందిన ఈ దుంగలకు అంతర్జాతీయంగా మంచి ఖరీదు లభించే అవకాశముంది.
2014 నుంచి 2019 వరకూ 1251 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం దుంగల్ని గత ప్రభుత్వం ఇ-ఆక్షన్ ద్వారానే అంతర్జాతీయ మార్కెట్ లో విక్రయించింది. వీటి విక్రయానికి గానూ 505 కోట్ల రూపాయల ఆదాయం గత ప్రభుత్వానికి సమకూరింది. 2021 వరకూ వేసిన వేలం లోనూ ప్రభుత్వానికి 1700 కోట్ల రూపాయల మేర నిధులు సమకూరాయి. ప్రస్తుతం వచ్చే ఏడాది మార్చి వరకూ 2640 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఇవీ చదవండి: