ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే మూడు నెలల్లో రూ.25 వేల కోట్ల బహిరంగ మార్కెట్ రుణం కావాలంటోంది. మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.2,000 కోట్ల రుణం తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జులై నుంచి సెప్టెంబరు మధ్య రిజర్వుబ్యాంకు వద్ద సెక్యూరిటీల వేలంలో రూ.25వేల కోట్ల అప్పు అవసరమవుతుందని కూడా తెలియజేసింది. రాబోయే మూడు నెలల్లో ఏ రాష్ట్రం ఎంత అప్పు కోరుతోందో రిజర్వుబ్యాంకు సూచనాత్మక క్యాలెండర్ విడుదల చేసింది. ఇవి అంచనాలేనని.. వేలానికి రెండు, మూడు రోజుల ముందు ఆయా రాష్ట్రాలకు ఉన్న అర్హతల ప్రకారం వాస్తవంగా ఎంత రుణ అర్హత ఉందో మళ్లీ సమాచారం ఇస్తామని రిజర్వుబ్యాంకు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థికశాఖ రూ.28వేల కోట్ల రుణాలకే అనుమతులు ఇచ్చింది. అందులో ఇప్పటికే రూ.17,500 కోట్లు తీసేసుకున్నాం. ఇక ఉన్న అర్హత రూ.10,500 కోట్లు మాత్రమే. మరోవైపు అదనపు అనుమతుల కోసం రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. గతంలో వినియోగించుకోని రుణాలు అంటూ కొంత, మూలధన వ్యయంతో అనుసంధానమయ్యే రుణ పరిమితుల పేరుతో మరికొంత, తమకు అదనపు రుణాలకు అర్హతలు ఉన్నాయంటూ ఆర్థికశాఖ అధికారులు కేంద్రానికి లేఖలు రాస్తున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: