ap employees' strike : పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాలంటూ రేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించింది. విజయవాడ రెవెన్యూ భవన్‌లో సమావేశమైన ఉద్యోగ సంఘాల నాయకులు.. సమ్మె నోటీసు ఎలా ఉండాలి....ఆ తర్వాత ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలన్న దానిపై చర్చించారు. న్యాయపరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సమ్మె నోటీసు ఉండేలా ఉద్యోగ సంఘాలు నాయకులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వం పిలుపు..
మరోవైపు...సమ్మె నివారణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నాయకులకు మంత్రులు..బొత్స, పేర్ని నాని పోన్ చేసినట్లు సమాచారం. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని సూచించినట్లు తెలుస్తోంది. అయితే..జీవోలపై వెనక్కు తగ్గే వరకూ చర్చల ప్రసక్తే వద్దని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే సీఎస్‌కు సమ్మె నోటీసు ఇచ్చేందుకు తాము సిద్ధమయ్యామని.. ఈ సమయంలో వెనక్కు తగ్దే ఉద్దేశం లేదని మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది.
కొత్త పీఆర్సీపై కసరత్తు..!
మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన కొత్త స్కేళ్లతోనే జనవరి నెల జీతాలు సకాలంలో చెల్లించాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఖజానా శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆర్థికశాఖ అధికారులు మార్గదర్శకాలతో శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు ఇప్పటికే ఖజానా ఉద్యోగుల సర్వీసు అసోసియేషన్ తాము ఈ ప్రక్రియలో పాల్గొనబోమని ప్రభుత్వానికి తెలిపింది. ఆ సంఘం నాయకులు పి.శోభన్‌బాబు, రవికుమార్ ఉన్నతాధికారులకు ఈ సమాచారం ఇచ్చారు. తాజాగా పే అండ్ అకౌంట్సు ఉద్యోగుల సంఘం నాయకులు ఎం.వెంకటేశ్వరరెడ్డి, పి.శివప్రసాద్ కూడా ఉన్నతాధికారులను కలిసి తాము పీఆర్సీ అమలు ప్రక్రియలో పాల్గొనబోమని తేల్చిచెప్పారు.
ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ రెండ్రోజుల కిందట వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఏపీ సీఎఫ్‌ఎంఎస్ సీఈవో రవి సుభాష్, ఖజానా శాఖ డైరెక్టర్ మోహన్‌రావు, పే అండ్ అకౌంట్సు అధికారి కె.పద్మజ, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస పూజారి, జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, సహాయ ఖజానా అధికారులు, ఉప ఖజానా అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఖజానా శాఖ నిత్యం ఏమేం చేయాలనే దానిపైనా రావత్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదీ చూడండి
TDP Leaders arrest in Amaravathi : తెదేపా- వైకాపా శ్రేణుల సవాళ్లు...తెలుగు తమ్ముళ్ల అరెస్టులు...