స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించటమే తమ లక్ష్యమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. అందుకనుగుణంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు రమేశ్ కుమార్ స్పష్టం చేశారు.
పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రయత్నాలు...
గత ఎన్నికలతో పోల్చిచూస్తే సమయం తక్కువగా ఉందని... అయితే పోలింగ్‌లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనేలా చైతన్యం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నామని రమేశ్ కుమార్ అన్నారు. ఎన్నికల పరిశీలకులతోనూ.. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలంతా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పించనున్నామని... అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలపై ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని స్పష్టం చేశారు.
అడ్డుకోవటం సరికాదు...
చిత్తూరు జిల్లాలో నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిని అడ్డుకున్నారని తెలియగానే వెంటనే నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినట్లు రమేశ్ కుమార్ తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎవరైనా నామినేషన్లు వేయొచ్చని... ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకర్ని మరొకరు అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. అలాంటి ప్రాంతాల్లో అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీలకు ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు. ఎవరి ప్రభావమూ లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.
సూచనలు రాలేదు...
జిల్లాల్లో ఉన్న 1.90 లక్షల బ్యాలెట్ పెట్టెలు ఇప్పటికే సిద్ధం చేసినట్లు రమేశ్ వెల్లడించారు. ఇవికాక మరో 60 వేలు అవసరమవుతాయని కలెక్టర్లు చెప్పారని... వాటిని ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈవీఎంలు ప్రవేశపెట్టాలని రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల సంఘానికి సూచనలు రాలేదన్నారు. బ్యాలెట్ పెట్టెలు ఉపయోగిస్తున్నా సకాలంలోనే ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 3.66 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని సిద్ధం చేశామని... వీరందరికీ ఇప్పటికే శిక్షణ ప్రారంభమైందన్నారు.
సంక్షేమ పథకాల అమలు నిలిపివేయిస్తున్నాం...
ఎన్నికల కోడ్ ఉన్నందున.. ప్రజలకు వ్యక్తిగత ప్రయోజనం కల్పించే సంక్షేమ పథకాల అమలును నిలిపివేయిస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ పట్టుబడితే శిక్షలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నామని.... నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయన్నారు. ఎవరికీ మినహాయింపులుండవని మరోమారు స్పష్టం చేశారు.
విశాఖ ఏజెన్సీలోని కొన్నిచోట్ల ఎన్నికలపై మావోయిస్టుల ప్రభావం ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపినట్లు రమేశ్ కుమార్ వెల్లడించారు. అలాంటి ప్రాంతాలకు సిబ్బంది, పోలింగ్ సామగ్రి తరలింపునకు సాధారణ ఎన్నికల్లో మాదిరిగానే హెలికాప్టర్ వినియోగించాలని యోచిస్తున్నారని వెల్లడించారు.