స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు, సిబ్బందికి విధుల కేటాయింపు, ఎన్నికల సామగ్రి తరలింపు, పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళి అమలుతో పాటు హింసాత్మక ఘటనలకు తావులేకుండా చూడాలని ఎస్పీలకు సూచించారు. ఓటర్ల జాబితా విడుదల, పోలింగ్ బూత్‌ల గుర్తింపునకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ ముందే సమర్పించాలని ఆదేశించారు.
రెండు దశల్లో ఎన్నికలు
మొత్తం రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రమేశ్ కుమార్ పేర్కొన్నారు. తొలి దశలో 333 జడ్పీటీసీలు, 5,352 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. 17,494 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి దశలో కోటీ 45 లక్షల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. రెండో దశలో 327 జడ్పీటీసీలు, 4,960 ఎంపీటీసీలకు పోలింగ్ నిర్వహించనుండగా....16,831 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో సుమారు కోటీ 36 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండు దశల్లోనూ 2 లక్షల 18వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారని తెలిపారు.
ఇదీ చదవండి: