'రేపటి నుంచి నేను రెడ్డినే... రెడ్డి అనుకుంటేనే నా వెంట నడుస్తామంటే... రఘపతి రెడ్డి అని అనుకోండి, ఏం ఫర్వాలేదు. రెడ్డి సమాజం కోసం రాబోయే కాలంలో ఏం చేస్తానో మీరే చూస్తారు'. ఈ వ్యాఖ్యలు చేసింది ఏవరో కాదు... ఉపసభాపతి కోన రఘుపతి. కార్తీకమాసం సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక సమీపంలో సామాజికవర్గాల వారీగా వనభోజనాలకు వెళ్తారు.
ఈసారి మాత్రం మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అనుచరులు ఒక వర్గంగా... కోన రఘపతి నేతృత్వంలో రెడ్డి వర్గం నాయకులు మరో వర్గంగా విడిపోయి వనభోజనాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఉపసభాపతి కోన రఘపతి... రెడ్డి సామాజికవర్గంపై ప్రశంసలు కురిపించారు. రేపటి నుంచి తనను కూడా 'రెడ్డి' అని పిలవండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆకలితో ఉన్నవాడు ఏ గ్రామంలోకి వెళ్లినా పట్టెడన్నం పెట్టేవారు రెడ్డి సామాజికవర్గం వాళ్లు. అటువంటి వర్గాలను కోన రఘపతి రెండుగా విభజించి ప్రోత్సహిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. కొందరు తెదేపా నేతలు రెడ్డి సామాజికవర్గం ముసుగు వేసుకొని ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నది వైకాపా రెడ్డి సంఘం సమావేశం. మనం అందరం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలి. భవిష్యత్తు మనదే. ప్రత్యర్థి పార్టీల కాలం చెల్లిపోయింది. అవసరమైతే నన్ను కూడా రేపటి నుంచి రఘుపతి రెడ్డి అని పిలవండి... ఏం ఫర్వాలేదు.
- కోన రఘుపతి, ఉప సభాపతి
ఇదీ చదవండి : తెలంగాణ మద్యం కిక్కులో సరిహద్దు పల్లెలు..!