నూతన విద్యా విధానానికి అనుగుణంగా ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించేందుకు మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పాఠశాల విద్య సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘నూతన విద్యావిధానం ప్రకారం ఆరు రకాల పాఠశాలలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే కొన్నింటిని తీసుకొచ్చాం. మిగతా పాఠశాలల మ్యాపింగ్‌పై దృష్టి పెట్టాలి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.
‘నాడు-నేడు’ తర్వాత పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెరిగినందున అదనపు వసతుల కల్పన, సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బంది నియామకంపై దృష్టి సారించాలి. వీటిపై తీసుకున్న చర్యలపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలి. పెరిగిన పిల్లల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని, అదనపు తరగతి గదులు నిర్మించాలి.
మొదటి దశలో కల్పించిన వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీని గురించి పట్టించుకోకపోతే పనులకు అర్థం ఉండదు. దీనిపై కార్యాచరణ రూపొందించాలి’ అని సూచించారు.
ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలి
‘పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బంది ఉండాలి. దీన్ని అమలు చేయడంలో ఉపాధ్యాయుల సహకారాన్ని తీసుకోవాలి. వారితో మాట్లాడి సలహాలు, సూచనలు తీసుకుని సమర్థవంతంగా అమలు చేయాలి. పిల్లలకు మంచి చేసేందుకు తీసుకున్న నిర్ణయాలను వివరించి, వారిని భాగస్వాములను చేయాలి. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసే వాటిని పరిగణనలోకి తీసుకుని, వారి సూచనలతో ముందుకువెళ్లాలి. అంగన్‌వాడీలు, పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్ క్లినిక్‌లు దృష్టి పెట్టాలి. ఎప్పటికప్పుడు వారికి పరీక్షలు నిర్వహించాలి. రక్తహీనతలాంటి సమస్యల నివారణకు ఇది ఉపయోగపడుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు వీటిని అనుసంధానం చేస్తే వారు తగిన చికిత్స అందిస్తారు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
నిరంతరం పర్యవేక్షించాలి
‘ఆంగ్ల పరిజ్ఞానం కోసం ఉద్దేశించిన యాప్స్‌ను ఉపాధ్యాయులు, విద్యార్థులు బాగా వినియోగించుకునేలా చూడాలి. జిల్లా అధికారులు నిరంతరం పాఠశాలలను పర్యవేక్షించాలి. గోరుముద్ద నాణ్యత పరిశీలన కొనసాగాలి. వసతుల కల్పన, నిర్వహణలో లోపాలు ఉంటే వెంటనే వాటిని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలి. గోరుముద్ద కింద ఇంకా కొత్త వంటకాలను అందించడంపై దృష్టి పెట్టాలి. మన ఇంట్లో మనం తినే తిండి ఎంత శుచిగా ఉండాలనుకుంటామో పాఠశాలల్లో వండే ఆహారం అంతే నాణ్యతగా ఉండాలి. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలి. ప్రభుత్వ పాఠశాల అందరిదీ అనే భావన రావాలి’ అని సీఎం జగన్ చెప్పారు.
"సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బంది ఉండాలి. ఆంగ్ల పరిజ్ఞానం కోసం యాప్స్‌ను బాగా వినియోగించుకోవాలి. జిల్లా అధికారులు నిరంతరం పాఠశాలలను పర్యవేక్షించాలి. అంగన్వాడీలు, పాఠశాల విద్యార్థులపై విలేజ్ క్లినిక్స్ దృష్టి పెట్టాలి. పీహెచ్‌సీలకు అనుసంధానం చేసి పిల్లలకు వైద్యచికిత్స అందించాలి" - ముఖ్యమంత్రి జగన్
ఇదీ చదవండి