రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకూ రూ.31,751 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం సమీకరించింది. డిసెంబరు నెలాఖరు వరకు రూ.2,155 కోట్లే సెక్యూరిటీల వేలం ద్వారా రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. అందులోనూ మరో వెయ్యి కోట్ల రుణానికి ఇప్పటికే రిజర్వు బ్యాంకుకు ఆర్థికశాఖ ప్రతిపాదనలు పంపింది. వచ్చే మంగళవారం వేలంలో పాల్గొని వేర్వేరు కాల పరిమితుల్లో తీర్చేలా చెరో రూ.500 కోట్లు రుణం సమీకరించనుంది. ఇదీ పూర్తయితే డిసెంబరు నెలాఖరు వరకూ మిగిలేది రూ.1,155 కోట్లే. ఇంకా.. నవంబరు, డిసెంబరు గడవాలి. కొన్నాళ్లుగా నెలకు రూ.5,000 కోట్ల రుణం తీసుకుంటేనే రాష్ట్రం అవసరాలు సర్దుబాటు అవుతున్నాయి. గత ఏడు నెలల్లో నాలుగు నెలలు ఇలాగే తీసుకున్నారు. మరోవైపు అనేక బిల్లులు పెండింగులో ఉన్నాయి.
లెక్కలు... కోతలు
ఆంధ్రప్రదేశ్‌కు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.42,472 కోట్ల రుణ పరిమితిగా కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం తేల్చింది. ఇందులో నుంచి మూలధన వ్యయంతో అనుసంధానిస్తూ రూ.5,309 కోట్లు కోత పెట్టింది.
గతంలోనే అప్పులు తీసుకుని మళ్లీ చెల్లించినందున రూ.14,429 కోట్లు అదనంగా కలిపింది. అన్నీ కలిపి రుణ అర్హత రూ.51,592 కోట్లుగా లెక్క కట్టింది. అంతకుముందు సంవత్సరాల్లో రాష్ట్రం తన అర్హతకు మించి రూ.17,923 కోట్లు అదనంగా వాడేసిందని ఆ మొత్తాన్ని మినహాయించింది. ఇక రుణ అర్హత రూ.33,669 కోట్లుగా లెక్క కట్టింది. ఇతర రూపాల్లో తీసుకున్న రుణాలూ మినహాయించి రూ.27,668.68 కోట్లుగా లెక్క కట్టింది. ఆ లెక్క ఆధారంగా డిసెంబరు నెలాఖరు వరకు రుణ పరిమితిని రూ.20,751.51 కోట్లుగా తేల్చింది.
* ఆ తర్వాత ఆగస్టు నెలాఖరులో మరో రూ.10,500 కోట్ల మేర రుణానికి అనుమతించింది.
* ఆగస్టులోనే తొలి మూడు నెలల మూలధన వ్యయం లెక్కలు పరిశీలించి, కోత పెట్టిన మొత్తంలో రూ.2,655 కోట్ల మినహాయింపు ఇచ్చింది.
* ఇలా డిసెంబరు నెలాఖరు వరకు మొత్తం రుణ అర్హత రూ.33,906 కోట్లకు చేరింది.
* ఇందులో ఇంతవరకూ రూ.31,751 కోట్లు వాడేశాం. ఇక మిగిలింది రూ.2,155 కోట్లు.
మళ్లీ మూలధన వ్యయ సమీక్ష
రాష్ట్రప్రభుత్వం రెండో త్రైమాసికంలో ఎంతమేర మూలధన వ్యయం చేసిందో కేంద్ర వ్యయ విభాగం సమీక్షించనుంది. జులై, ఆగస్టు, సెప్టెంబరు నెల లెక్కలు ఖరారైన తర్వాత వీటిపై త్వరలో సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర ప్రమాణాల ప్రకారం మూలధన వ్యయం ఖర్చు చేస్తే మరికొంత రుణ పరిమితి పెంచే ఆస్కారం ఉందని ఎదురుచూస్తున్నారు.