ఇంతమంది రావడం హర్షనీయం
దిల్లీ తర్వాత భారీ సంఖ్యలో దౌత్యవేత్తల సమావేశానికి హాజరవ్వడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ భేటీని ఏర్పాటు చేసిన కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి మెట్రో సిటీలు లేకపోవడం ఇబ్బందన్న ఆయన... సుదీర్ఘ తీర ప్రాంతం, మంచి వనరులు ఏపీ సొంతమని తెలియజేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని... అవినీతిరహిత, పారదర్శక పాలన అందిస్తున్నామని దౌత్యవేత్తలకు వివరించారు.
ఏం చేసిన రాష్ట్రం బాగు కోసమే
అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే విప్లవాత్మకతమైన నిర్ణయాలు తీసుకున్నామన్న జగన్... ప్రజలకు మేలు జరగాలనే చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష చేయాలన్న నిర్ణయం అలాంటిదేనన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలను రక్షించుకోవాలంటే ఇది తప్పనిసరని పేర్కొన్నారు. వినియోగదారులు, పంపిణీ సంస్థలు, ప్రభుత్వం ఎవరూ నష్టపోకూడదన్నదే తమ ఆకాంక్షని తెలిపారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించడం సాహసోపేత నిర్ణయమన్నారు. కాలుష్యం ఇచ్చే పరిశ్రమలు స్థానికులకు ఉపాధి కల్పించకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం స్థానిక ఇంజినీరింగ్ కళాశాలల్లో నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.