నూతన ఐటీ విధానం అమలు, నిధుల సమీకరణకు అనుమతి మంజూరు వంటి.. కీలకమైన అంశాల చర్చించేందుకు మంత్రివర్గం... నేడు ఉదయం 11 గంటలకు భేటీ కాబోతోంది. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై సమీక్షతో పాటు..ఇంకొన్ని కీలక పథకాల అమలుకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ (SC, ST) రైతులకు సాగు భూముల పంపిణీపై కూడా.. దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసే దిశగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
పేదలకు ఇళ్ల స్థలాలు క్రమబద్దీకరించే దిశగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు క్రమబద్ధీకరణ చేసే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశంఉంది. టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం రూ. 5,900 కోట్ల మేర రుణానికి బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చే అంశంపై కెబినెట్లో చర్చ జరగనుంది. అలాగే ప్రైవేట్ యూనివర్శిటీల నియంత్రణ, విద్యార్థులకు లాప్‌టాప్‌ల పంపిణీ, భూసేకరణ చట్టం వంటి అంశాలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయి.
తెలంగాణతో కృష్ణా జలాలకు సంబంధించిన వివాదం సహా..ఏపీ చేపట్టే వివిధ ప్రాజెక్టులపై ఆ రాష్ట్రం నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపైనా కేబినెట్‌లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్ విషయంలోనూ చర్చించనున్నట్టు సమాచారం. కోవిడ్ నియంత్రణ, మూడో దశ ముప్పు లాంటి అంశాలు.. తీసుకుంటున్న చర్యలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఇదీ చదవండి:
ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్