నైరుతి రుతుపవనాలు రాయలసీమను పలకరించాయి. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకూ విస్తరించనున్నాయి. బలమైన నైరుతి రుతుపవన గాలులతో శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ‘నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు మొత్తం కొంకణ్, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి. మరాఠ్వాడా, కర్ణాటకలోని చాలా ప్రాంతాలకు చేరాయి. తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మరిన్ని ప్రాంతాలతోపాటు పశ్చిమబెంగాల్, బిహార్ వరకు విస్తరించాయి. బుధవారం నాటికి తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులున్నాయి. శుక్రవారం నాటికి మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.
రుతుపవనాల రాక, ద్రోణి ప్రభావంతో వాతావరణం చల్లబడింది. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల మధ్య శ్రీసత్యసాయి జిల్లా పెదబల్లికొత్తపల్లిలో 68.5, కొడిహళ్లిలో 65.5, విజయనగరంలో 65 మి.మీ వర్షపాతం నమోదైంది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఏలూరు, పార్వతీపురం మన్యం తదితర జిల్లాల్లోనూ ఒక మోస్తరు వానలు కురిశాయి.
Rain in Vizianagaram: విజయనగరం జిల్లాలో పిడుగుపాటుతో ఓ మహిళ మృతిచెందగా.. ఆమె భర్త, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. వేపాడ మండలం డబ్బిరాజుపేట గ్రామానికి చెందిన గొర్లె గౌరి(32).. భర్త సత్తిబాబు, కూతురు జననితో కలిసి వేపాడులో ఉంటుంది. బక్కునాయుడుపేట కస్తూరిభా పాఠశాలలో నైట్ వాచ్ఉమెన్గా చేస్తున్న గౌరి.. సోమవారం సాయంత్రం భర్త, కమార్తెతో కలిసి బైకుపై డ్యూటీకి వెళ్తుంది. మార్గం మధ్యలో వీరికి సమీపంలో పిడుగు పడింది. ఈ క్రమంలో బైకు అదుపుతప్పి కింద పడటంతో గౌరి అక్కడికక్కడే మృతిచెందింది. సత్తిబాబు, జనని తీవ్రంగా గాయపడగా.. ఎస్.కోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.
ఇదీ చదవండి: