అమరావతి ఐకాస మహిళా నేతల అమరావతి రథోత్సవ పర్యటన ఉద్రిక్తలకు దారితీసింది. అమరావతిలోనే రాజధాని ఉండాలనే సంకల్పంతో అమరలింగేశ్వర స్వామి రథోత్సవానికి మహిళా ఐకాస నేతలు వెళ్తున్నారు. అదే సమయంలో రథోత్సవం నుంచి తిరిగొస్తున్న బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ లేమల్లే వద్ద మహిళలకు తారసపడ్డారు. జై అమరావతి అని అనాలంటూ మహిళా ఐకాస నేతలు ఎంపీని డిమాండ్ చేశారు. అందుకు ఆయన అంగీకరించలేదు.
అదే సమయంలో వైకాపా కార్యకర్తలు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మా ఎంపీని ఆపుతారా అంటూ ఆందోళనకారులను నెట్టేసి, సురేశ్‌ను అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత మహిళా ఐకాస నేతలు వచ్చిన బస్సును చుట్టుముట్టారు. రెండు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. పోలీసుల అక్కడికి చేరుకొని ఐకాస నేతలను అమరావతి ఠాణాకు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న రాజధాని రైతులు, మహిళలు అమరావతి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ స్టేషన్ ముందు బైఠాయించారు.
మహిళలపై దాడి చేసి, పరుష పదజాలంతో దూషించిన ఎంపీపై కాకుండా తిరిగి తమపైనే కేసులు ఎలా పెడతారని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఈ ఆందోళన కొనసాగింది. విషయం తెలుసుకున్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తెదేపా నేతలు ఆలపాటి రాజా, వర్ల రామయ్య, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరారవు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మహిళలకు సంఘీభావం తెలిపారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉండి, మహిళలపై ఇష్టారీతిన మాట్లాడం ఏంటని నిలదీశారు.
మహిళలపై దురుసుగా ప్రవర్తించిన ఎంపీ సురేశ్, దాడికి పాల్పడ్డ ఆయన అనుచరులపై కేసు నమోదు చేయాలని... అరెస్టు చేసిన ఐకాస నేతలను విడిచిపెట్టాలని కోరారు. అక్కడున్న పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. తర్వాత అక్కడకు చేరుకున్న తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెదేపా నేతలతో చర్చించారు. ఫిర్యాదు తీసుకుంటామని చెప్పారు. విచారించి ఎంపీపై కేసు నమోదు చేస్తామని చెప్పగా ఆందోళన విరమించారు. అంతకుముందు రథోత్సవం నుంచి తిరిగివస్తోన్న సురేశ్ వాహనం రైతుల ర్యాలీపైకి దూసుకెళ్లింది. వాహనం తగిలి హనుమంతరావు అనే రైతు కాలికి గాయమైంది. దీనిపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ... అమరావతిలో ఉద్రిక్తత... 20మంది మహిళలు అరెస్ట్