ఈ ఇద్దరే కాదు. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రతిచోట రైతుల ఆక్రోశం ఇదే ఇప్పుడు. నమ్మి భూములు ఇస్తే నట్టేట ముంచుతారా అని వారంతా ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఒప్పందం మేరకు నెరవేర్చాల్సిన హమీలు తీర్చకపోతే చట్టపరమైన చర్యలకు సైతం సిద్ధమని ఏడాదిగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని అంటేనే భూములు ఇచ్చామని... ఇప్పుడు అదే మాట ప్రభుత్వం నిలబెట్టుకోవాలని రైతులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ఇరువురి అంగీకారంతో కుదిరిన ఒప్పందాన్ని ఏకపక్షంగా ఎలా రద్దు చేస్తారని నిలదీస్తున్నారు.
అలుపెరగని పోరాటంలో రైతులు మొదట్నుంచి చేస్తున్న ప్రధాన డిమాండ్ ఒక్కటే. ఆనాడు సీఆర్డీఏతో జరిగిన ఒప్పందం ప్రకారమే అన్ని విధాల అభివృద్ధి చేయాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి రైతులు. పార్కులు, రోడ్లు, పాఠశాలలు, వైద్య కళాశాలలు, గృహనిర్మాణం... అన్నీ చెప్పిన ప్రకారమే చేయాలని కోరుతున్నారు.
మా హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడుతాం అంటున్న రైతులు... ప్రభుత్వాన్ని చూసి భూములు ఇచ్చాం కాబట్టి... ఆ ప్రభుత్వమే తమను కాపాడాలని వేడుకుంటున్నారు. రాత్రికి రాత్రే ఉత్తర్వులు తీసుకుని వచ్చి తమ జీవితాలతో చెలగాటమాడడం సబబు కాదని వాపోతున్నారు. ముఖ్యంగా 9-14 ఒప్పందాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని అభ్యర్థిస్తున్నారు.
ఇవే డిమాండ్లతో సేవ్ అమరావతి అంటూ రైతులు మొదలుపెట్టిన ఉద్యమానికి అప్పుడే ఏడాది గడిచి పోయింది. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, తమ ప్రయోజనాలు కాపాలని ప్రభుత్వానికి నివేదిస్తూ వినూత్నరీతుల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇకపై వారి కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి.
ఇదీ చదవండి : అమరావతి ఉద్యమానికి ఏడాది..రేపు రాయపూడిలో జనభేరి