AMARAVATI MAHA PADAYATRA IN CHITTOOR DISTRICT: 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమరావతికే మా మద్దతు అంటూ చిత్తూరు జిల్లా వాసులు స్పష్టం చేశారు. ప్రతి పల్లెలో మహిళలు, స్థానికులు పాదయాత్ర రైతులకు ఎదురేగి స్వాగతం పలికారు. పొలాల్లో పనిచేస్తున్న కర్షకులు సైతం చేయి ఎత్తి... జై అమరావతి అంటూ నినదించారు. రాజధాని రైతుల మహాపాదయాత్రకు 38వ రోజున కులమతాలకు అతీతంగా అపూర్వ మద్దతు లభించింది. నంద్యాలకు చెందిన ముస్లింలు పాదయాత్రలో పాదం కలిపారు. జగన్ రెడ్డి మూడు రాజధానులను విరమించుకొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని దువా చేశారు.
పులివెందుల నియోజకవర్గం వేంపల్లి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు. ఏకైక రాజధానికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల పాదయాత్రలో గురజాల తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు భార్య, కుమారుడితో కలిసి పాల్గొన్నారు. 100మంది జగన్ రెడ్డిలు వచ్చినా రాజధానిగా అమరావతిని అడ్డుకోలేరన్నారు.
నేడు జరగనున్న పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే ఆస్కారం ఉన్నందున శ్రీకాళహస్తి మాఢ వీధుల్లో నేడు పాదయాత్ర నిర్వహించవద్దని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఐకాస నేతలకు సూచించారు. దీనిపై పరిరక్షణ సమితి నేతలు అభ్యంతరం తెలిపారు. పాదయాత్ర నిర్వహించవద్దని తమకు లిఖితపూర్వకంగా నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు. చింతలపాలెం నుంచి దాదాపు 17 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అన్నదాతలు... పానగల్‌లో రహదారి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో టెంట్‌లు వేసుకుని బస చేశారు.
ఇదీ చదవండి:
CBN REVIEW: పార్టీలో ప్రక్షాళన కుప్పం నుంచే ప్రారంభిస్తాం: చంద్రబాబు