Amaravati Mahapadayatra : అమరావతి రైతుల మహాపాదయాత్ర 2.O.. ఘనంగా ప్రారంభమైంది. రాజధాని ఉద్యమానికి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి నుంచి అరసవల్లికి రైతులు పాదయాత్ర చేపట్టారు. వెంకటపాలెంలోని తితిదే ఆలయం వద్ద రైతులు ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు హారతులు పట్టి ఆలయం నుంచి మహాపాదయాత్ర ప్రారంభించారు. రాజధాని గ్రామాల రైతులు ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వెంకటేశ్వరస్వామి రథం పాదయాత్రలో ఆకర్షణగా నిలిచింది.
రైతుల పాదయాత్రకు అన్ని వర్గాలూ మద్దతు తెలిపాయి. అన్నదాతలకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర రథానికి.. నీళ్లు చల్లి, కొబ్బరికాయలు కొట్టి హారతులిస్తూ పాదయాత్ర విజయవంతం కావాలని కాంక్షించారు. రైతులపై పూలవర్షం కురిపిస్తూ సంఘీభావం వ్యక్తం చేశారు. రాజధాని రైతులు వెంకటపాలెంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి.. పాదయాత్ర ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. వైకాపా కార్యకర్తలూ మద్దతు తెలిపారు. రథం నడిపే బాధ్యతను వైకాపా శ్రేణులకే రైతులు అప్పగించారు.
వెంకటపాలెం నుంచి మొదలై పాదయాత్రగా ముందుకుసాగుతున్నరైతులకు.. కృష్ణాయపాలెం ప్రజలు పూలబాట పరిచి ఘనంగా స్వాగతం పలికారు. రెండు ట్రాక్టర్లతో పూలు తీసుకొచ్చిన గ్రామస్థులు.. పాదయాత్ర మార్గంలో వాటిని చల్లి.. రైతులను నడిపించారు. ఆకుపచ్చ బెలూన్లను గాలిలోకి వదిలి పాదయాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షించారు. పెనుమాకలోనూ అడుగడుగునా రైతులకు తాగునీరు, మజ్జిగ అందజేశారు. మద్దతుగా తరలివచ్చిన ప్రజలతో.. రైతుల పాదయాత్ర సాగిన మార్గం ఓ నదీ ప్రవాహంలా కనిపించింది. ప్రజల నుంచి లభించిన మద్దతుతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకుసాగారు.
మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. తమది దండయాత్ర అంటూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది ధర్మ యాత్ర అని స్పష్టంచేశారు. అమరావతి ఆవశ్యతకను, ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్న తీరును.. ఉత్తరాంధ్ర ప్రజలకు వివరించే లక్ష్యంతోనే పాదయాత్ర చేస్తున్నామని తేల్చిచెప్పారు.
ఎర్రబాలెంలో భోజన విరామం తీసుకున్న రైతులు.. మధ్యాహ్నం తర్వాత యాత్రను తిరిగి ప్రారంభించారు. తొలిరోజు 29 గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. వెంకటపాలెం నుంచి కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా పాదయాత్ర మంగళగిరి చేరుకుంది. 12 గంటలపాటు 15 కిలోమీటర్ల మేర నడిచి మంగళగిరి చేరుకున్న రైతులకు స్థానికులు పూలతో స్వాగతం పలికారు. మంగళగిరిలోనే బసచేయనున్న రైతులు.. మంగళవారం అక్కడి నుంచే రెండో రోజు పాదయాత్ర ప్రారంభించనున్నారు.
ఇవీ చదవండి: