రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు తలపెట్టిన ఉద్యమం.... సుదీర్ఘంగా కొనసాగుతోంది. కఠిన ఆంక్షలు, నిబంధనల మధ్యే.... అన్నదాతల పోరాటం 150వ రోజుకు చేరింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ మొదటి రోజు నుంచి నేటి వరకు.... అన్నదాతలు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పోరాటంలో ఎన్నో నిర్భందాలు, ఎదురుదెబ్బలు, వేధింపులు ఎదురైనా.. వెనక్కి తగ్గేదిలేదంటూ ఆకాంక్షను బలంగా చాటుతున్నారు. చివరికి రాజధాని తరలింపుపై హైకోర్టును ఆశ్రయించారు. చట్టసభల్లో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం.... శాసనప్రక్రియ పూర్తైన తర్వాతే రాజధాని తరలింపును చేపడతామని అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. అయితే కోర్టుకు చెప్పిన విధంగా కాకుండా ప్రభుత్వం తెరవెనుక రాజధాని తరలింపునకు ప్రయత్నిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యంచేసుకోవాలని కోరుతున్నారు.
ఉద్యమం 150 రోజులకు చేరిన సందర్భంగా నేడు.. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.. రాజధాని రైతులు, మహిళలు నిరాహారదీక్షలు చేయనున్నారు. రాత్రి ఏడున్నర గంటలకు దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతలతో పాటు విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు.
ప్రభుత్వ ఎత్తులను ఎదుర్కొంటూనే, తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామంటున్న రైతులు.... అంతిమ విజయం తమదేనని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఆలోచనను మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: