రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి అన్నదాతలు చేస్తున్న ఉద్యమం కొత్తరూపు సంతరించుకోనుంది. అలుపెరగని పోరుకు ఏడాది పూర్తైన సందర్భంగా రాయపూడిలో నిర్వహించిన 'జనభేరి' విజయవంతమైందన్న ఐకాస.. ఉద్యమతీవ్రత పెంచేలా కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకూ రాజధాని గ్రామాల్లోని శిబిరాల్లోనే రైతులు నిరసన తెలపగా బయటకొచ్చిన ప్రతిసారి పోలీసులు అడ్డుకుని ఇప్పటివరకూ 100కు పైగా కేసులు నమోదు చేశారు. తాము నిర్వహించిన జనభేరికి 30వేల మందికిపైగా తరలివచ్చారని.. ఇదే ఊపులో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని ఉద్యమంలో భాగస్వామ్యం చేయడంపై చర్చించినట్టు ఐకాస నేతలు వెల్లడించారు.
నియోజకవర్గానికో ప్రత్యేక ఐకాస
ప్రస్తుతం రాజధాని పరిధిలో రైతు ఐకాస, రాష్ట్ర పరిధిలో అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ ఐకాస, గుంటూరు, కృష్ణా జిల్లాల రాజకీయేతర ఐకాస ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి. ఇకపై నియోజకవర్గానికో ప్రత్యేక ఐకాస ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మద్దతు కూడగట్టడం, రాజకీయ పార్టీలను ఉద్యమంలోకి తీసుకురావడం, వీటితో పాటు న్యాయపోరాటం సాగించడం.. ఇలా త్రిముఖ వ్యూహంతో తమ ఉద్యమం సాగనున్నట్టు ఐకాస ప్రకటించింది.
ఇదీ చదవండి: అమరావతి ఉద్యమంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్