హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి పదవీ విరమణ సందర్భంగా రాజధాని రైతులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. రాజధాని అమరావతిపై చారిత్రాత్మక తీర్పునిచ్చిన న్యాయమూర్తులలో సత్యనారాయణ మూర్తి ఒకరు. దీంతో ఆయన పదవి విరమణ సందర్భంగా రైతులు కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు నుంచి రాయపూడి సమీపంలోని సీడ్ యాక్సెస్ రహదారి వరకు పూలబాట పరిచారు. మెడలో ఆకుపచ్చ కండువాలు, జాతీయ జెండాలు చేతబూని జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 'న్యాయస్థానమే దేవస్థానం - న్యాయమూర్తులే మా దేవుళ్లు' అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటికీ ఆయన తమ మనసులో చిరస్థాయిగా నిలిచి ఉంటారని.. పదవీ విరమణ అనంతరం ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో ఆనందమయంగా సాగాలని రైతులు ఆకాంక్షించారు.
ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మార్చి 3న అమరావతి రైతులకు అనుకులంగా తీర్పునిచ్చింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం రాజధానిని మార్చటం, విభజించడం, హెచ్వోడీల మార్పుపై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పు వల్లే తాము ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నామని రాజధాని రైతులు వెల్లడించారు.
ఇవీ చూడండి