ఒకటి కాదు... రెండు కాదు... 500రోజులుగా అమరావతి ఉద్యమ స్ఫూర్తి రగులుతూనే ఉంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న పోరును అణచివేసేందుకు ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఉద్యమం ఉద్ధృతమైందే తప్ప సంకల్పం సడల లేదు. కొవిడ్ విజృంభణ వేళ 500వ రోజూ 'అమరావతి ఉద్యమ భేరి' పేరుతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపూడి దీక్షా శిబిరంలో దళిత చైతన్య గీతిక సీడీని ఆవిష్కరించారు. అమరావతి ఐకాసతో పాటు దళిత ఐకాస నేతలు పాల్గొన్నారు. ఉద్ధండరాయినిపాలెంలో బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అమరావతిని కాపాడాలని, ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మహిళల పాత్ర అనిర్వచనీయం...
అమరావతి పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దీక్షా శిబిరాలను సందర్శించిన ఆయన రైతులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం విలువైన భూములిచ్చిన తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని మహిళా రైతులు ఆవేదన చెందారు. రాజధాని రైతులకు న్యాయం చేస్తామన్న ప్రభుత్వం మాటలకే పరిమితమైందని... కనీసం కౌలు కూడా సకాలంలో వేయలేదని ఆరోపించారు.
ఉద్యమంలో చనిపోయిన వారికి నివాళులు...
అమరావతి ఉద్యమంలో చనిపోయిన రైతులకు పరిరక్షణ సమితి నివాళులు అర్పించింది. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన రోజు నుంచి తమకు తిండి, నిద్ర కరవైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతి కోసం చేస్తున్న పోరాటాన్ని వివిధ రూపాల్లో కొనసాగించాలని రైతులు తీర్మానించారు. కొవిడ్ ఉద్ధృతి తగ్గిన తర్వాత ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తామన్నారు.
ఇవీచదవండి.