అమరావతి తరలిపోతోందనే మనోవేదనతో వంద మందికి పైగా రైతులు, రైతు కూలీలు చనిపోయారని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంతమంది బలిదానాలను రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి అన్నదాతల ఆక్రందనలను అర్థం చేసుకుని ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రైతులకు అండగా నిలవాలని కోరారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు సోమవారం నాటికి 363వ రోజుకు చేరాయి. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని కోరుతూ అనంతవరంలో మహిళలు.. వెంకటేశ్వరస్వామికి పూజలు చేశారు. రైతుల జీవితాలతో మూడు ముక్కలాటలు వద్దు అంటూ వెంకటపాలెంలో రైతులు నినాదాలు చేశారు. పెనుమాక బొడ్డురాయి సెంటర్ వద్ద రైతులు దీక్షలు కొనసాగించారు. నీరుకొండ, ఐనవోలు, ఎర్రబాలెం, పెదపరిమి, మందడం, వెలగపూడి, తుళ్లూరు తదితర గ్రామాల్లో నిరసన దీక్షలను చేపట్టారు. ‘అమరావతి వెలుగు’ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి మహిళలు, చిన్నారులు దీపాలు వెలిగించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి మండలం నీరుకొండకు చెందిన రైతు మాదల సుధాకర్(57) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. భూసమీకరణలో ఆయన రాజధానికి 8 ఎకరాలు ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి ఆందోళన చెందుతున్నారు. రాజధాని ఉద్యమంలోనూ ఆయన పాల్గొంటున్నారు. ఉద్యమం ప్రారంభమై ఏడాది గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో దిగులు చెందిన సుధాకర్ గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల రాజధాని అమరావతి ఉద్యమం ఐకాస నాయకులు సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి: జ్ఞానభూమిలో సాంకేతిక ఇక్కట్లు