రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తోన్న ఆందోళనలు ఇవాళ 36వ రోజుకు చేరాయి. వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ఇవాళ్టి వరకూ తమ అభిప్రాయాలను సీఆర్డీఏకు తెలిపే అవకాశం ఉన్నా... ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని రాజధాని రైతులు మండిపడుతున్నారు. న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా తమకు ఇచ్చిన అవకాశాన్ని సర్కారు కాలరాసిందని వారు ఆక్షేపించారు. న్యాయస్థానాలపై ముఖ్యమంత్రికి గౌరవం లేకపోయినా... ప్రభుత్వ అధికారులకైనా ఉండాలని హితవు పలికారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదానికి నిరసనగా ఇవాళ కృష్ణా, గుంటూరు జిల్లాల బంద్‌కు ఐకాస నేతలు పిలుపునిచ్చారు. ప్రజలు, వ్యాపారస్థులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.
న్యాయపోరాటం చేస్తాం
గడువు సమయం ముగియక ముందే సీఆర్డీఏ బిల్లును అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడతారని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని రైతులు తేల్చి చెప్పారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అయితే రాజధాని గ్రామాల్లో ఐకాస బంద్ విజయవంతం అయ్యింది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి తమ నిరసన తెలిపారు. పోలీసులకు కనీసం మంచినీరు సహా ఎలాంటి ఆహార పదార్థాలు విక్రయించకుండా సహాయ నిరాకరణ చేపట్టారు.
కొనసాగనున్న రిలే నిరాహార దీక్షలు
మందడం, తుళ్లూరుల్లో మహాధర్నాలు నిర్వహించనుండగా... వెలగపూడి, కృష్ణాయపాలెంలోనూ నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్ధండరాయని పాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పూజలు నిర్వహించి నిరసనలు తెలపనున్నారు. అసెంబ్లీ నిర్వహణ దృష్ట్యా పోలీసు ఆంక్షలు పెద్ద ఎత్తున పెరిగినా తమ నిరసనలను ఆపరాదని రైతులు నిర్ణయించారు. పోలీసులు అడ్డుకుంటే ఇళ్లు, ఆలయాల వద్దే తమ నిరసనలు కొనసాగించనున్నారు. ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు ఇతర గ్రామాలతోపాటు కృష్ణ, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లోనూ ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ ఆందోళనలు చేపట్టనున్నాయి.
ఇదీ చూడండి: