నాణ్యమైన విద్యకు అమ్మఒడి, మిడ్ డే మీల్స్, ఆంగ్లమాధ్యమం, నాడు-నేడు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని కార్యక్రమం అమ్మ ఒడి అని పేర్కొన్నారు. 82 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చేందుకు తల్లులకు తోడుగా పథకం ప్రవేశపెట్టానని జగన్ అన్నారు. సాంకేతిక కారణాలతో లబ్ధిపొందని వారికి.. వెంటనే వర్తించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గోరుముద్ద
''మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు తీసుకొచ్చాం. పిల్లలకు ప్రతీ రోజు ఒకేరకమైన భోజనం కాకుండా రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. గోరుముద్ద పేరిట విద్యార్థులకు భోజనం అందజేస్తాం. విధంగా పథకం సాఫీగా అమలు జరిగేలా... ఆయాల జీతం రూ. 1000 నుంచి రూ. 3 వేలకు పెంచాం. దాదాపు రూ. 344 కోట్ల భారం పడుతుంది'' అని సీఎం జగన్ తెలిపారు.
నాలుగంచెల వ్యవస్థ..
ఇక మధ్యాహ్న భోజన పథకం పనితీరును పర్యవేక్షించేందుకు నాలుగు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ’’ఎక్కడా అవినీతి ఉండొద్దని.. కోడిగుడ్ల టెండర్లలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచంతో పిల్లలు పోటీ పడేలా రైట్ టు ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చామని తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియాన్ని ప్రారంభిస్తున్నామన్న జగన్... ఇంగ్లీషు మీడియంపై విద్యార్థులు, టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
విద్యాకానుక: ప్రతీ పిల్లాడికి ఒక కిట్
విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రతీ విద్యార్థికి ఓ కిట్ అందజేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ‘‘స్కూలు బ్యాగు.. మూడు జతల యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టుతో కూడిన కిట్‌ను విద్యా కానుక పేరిట అందజేస్తాం. దాదాపు 36 లక్షల పదివేల మంది పిల్లలకు మేలు చేకూరుతుంది. వసతి దీవెన కింద.. హాస్టల్‌లో ఉండే పిల్లల తల్లులకు రెండు దఫాల్లో రూ. 20 వేలు అందిస్తాం'' అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఇదీ చదవండి: అందరికీ మంచి జరగాలనే కార్పొరేషన్లు: సీఎం జగన్