అమరావతి ప్రాంత రైతులు.. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభలో భాజపా సభ్యుడు సుజనాచౌదరిని కలిశారు. రాష్ట్ర రాజధాని విషయంలో ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలవాలని కోరారు. స్పందించిన సుజనా.. వారిని ముందుగా ముఖ్యమంత్రి జగన్ను కలవాలని సూచించారు. జగన్ ఏదైనా చెబితే.. తర్వాత తాను మాట్లాడతానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. ప్రజలు, రైతులు తిరగబడతారని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ రాజధాని మార్పుపై.. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఏదీ చెప్పలేదు కాబట్టి.. సమస్య ఏమీ లేదని రైతులకు భరోసా ఇచ్చారు.
''కేంద్రానికి చెప్పారనడం పచ్చి అబద్ధం''
పీపీఏల రద్దు, పోలవరం రివర్స్ టెండరింగ్ విషయాలను.. ముందుగానే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లామని.. వైకాపా ఎంపీ విజయసాయి చెప్పడంపై.. సుజనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పచ్చి అబద్ధం అన్నారు. విజయసాయి వ్యాఖ్యలు హాస్యాస్పదమని.. ఏ మాత్రం వాటిలో నిజం లేదని తేల్చారు. రాజధాని నిర్మాణం రాష్ట్ర పరిధిలోనే ఉంటుందన్న సుజనా.. కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా ఆర్థిక శాఖ సలహా మేరకే నడుచుకుంటుందని చెప్పారు.
''ఒక్క గజం తీసుకోలేదు''
అమరావతి ప్రాంతంలో తాను ఒక్క గజం భూమిని తీసుకోలేదని సుజనా స్పష్టం చేశారు. వైకాపా నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పార్టీ భాజపా అన్న ఆయన.. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు.. తాను చాలాసార్లు చెప్పామని గుర్తు చేశారు. ఇన్నాళ్లూ రాష్ట్రానికి కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అండగా నిలిచారని.. ఇప్పుడు ఆయన మనమధ్య లేరని ఆవేదన చెందారు.