విజయవాడ బందర్ రోడ్‌లోని ఓ హోటల్లో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెదేపా, జనసేన, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఉద్యమ కార్యాచరణపై అఖిలపక్ష నేతలు సమావేశంలో చర్చించి... కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతిని తరలించవద్దని అఖిలపక్షం ఏకగ్రీవంగా ప్రభుత్వాన్ని కోరింది. రేపట్నుంచి విజయవాడ ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు నిర్వహిస్తామని తెలిపింది. అందరూ నల్లబ్యాడ్జీలతో మానవహారాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. మంత్రివర్గ భేటీలో రాజధాని తరలింపుపై నిర్ణయం తీసుకోకూడదని.. అలా కాకుండా ముందుకెళ్తే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
విశాఖలో ఇప్పటికే వేల ఎకరాలు చేతులు మారాయని అఖిలపక్ష భేటీలో తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. భీమిలిలో రాజధాని వస్తుందని విజయసాయిరెడ్డి ముందుగానే ప్రకటించారని ఉమ గుర్తు చేశారు. కేబినేట్ భేటీ రోజున నిరసనలు చేయొద్దంటూ రాజధాని గ్రామాల్లో ప్రజలకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. నోటీసులు, లాఠీలకు భయపడేది లేదని దేవినేని ఉమ స్పష్టం చేశారు. రాజధానికి భూములిచ్చిన వారిలో 25 వేలమంది చిన్న రైతులే ఉన్నారని అన్నారు.
సమావేశం అనంతరం అఖిలపక్ష నేతలు బందర్ రోడ్ మిడ్ సిటీ హోటల్ నుంచి కాగడాల ర్యాలీ చేపట్టారు. అమరావతిని కాపాడాలంటూ నినాదాలు చేశారు. బందర్ రోడ్ మీదుగా చేస్తున్న ర్యాలీని అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
ఇదీ చదవండి :