Advocates on Amaravathi issue: సీఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఈ భూములు కేటాయించకూడదని స్పష్టం చేయడమే కాక..అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని హైకోర్టు ఆదేశించినట్లు న్యాయవాది రాజేంద్ర తెలిపారు.
హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రజల గొప్ప విజయంగా భావించాలని న్యాయవాది సుంక రాజేంద్రప్రసాద్ అన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించి చట్టాలు చేయడాన్ని హైకోర్టు గుర్తించిందన్న రాజేంద్రప్రసాద్.. పిటిషనర్లకు ఖర్చుకోసం రూ.50వేలు ఇవ్వాలని చెప్పడం తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. రైతులకు చేసిన వాగ్దానాలను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకుంటుందని మేం అనుకోవట్లేదని ఆయన అన్నారు.
అమరావతిపై హైకోర్టు తీర్పు పట్ల న్యాయవాది నర్రా శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. త్రిసభ్య ధర్మాసనం.. 75 కేసుల్లో వేర్వేరుగా తీర్పులిచ్చిందని.. ముఖ్యంగా నాలుగైదు అంశాలను తీర్పులో స్పష్టంగా వివరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసన వ్యవస్థకు 3రాజధానుల చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు చెప్పిందన్నారు.
సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి: హైకోర్టు