రాష్ట్ర ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) బెంచ్ విచారణ చేపట్టింది. కేంద్రానికి కనీసం సమాచారమైనా ఇచ్చారా అంటూ ప్రభుత్వాన్ని ట్రైబ్యునల్ ప్రశ్నించింది. సస్పెన్షన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారును ఆదేశిస్తూ విచారణను 24కు వాయిదా వేసింది. అయితే సస్పెన్షన్ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.
వేతనమూ ఇవ్వలేదు
సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెన్షన్‌పై కేంద్రానికి సమాచారం ఇవ్వలేదని ఏబీ వెంకటేశ్వరరావు తరఫు న్యాయవాది విద్యాసాగర్ వాదించారు. గతేడాది మే నుంచి వేతనం కూడా ఇవ్వలేదని తెలిపారు. వివరణ కూడా తీసుకోకుండా సస్పెండ్ చేశారన్నారు. అధికారులపై వచ్చిన ఆరోపణలను కేంద్రానికి పంపాలని.. వాటిని పరిశీలించి కేంద్రం సంతృప్తి చెందాకే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. గత ఏడాది మే 31న ఆయన్ను బదిలీ చేశారని.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పోస్టింగ్ ఇవ్వలేదని, కనీసం వేతనమూ ఇవ్వలేదని చెప్పారు.
ప్రభుత్వానికి అధికారం ఉంది
భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరుగుతోందని.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చట్టబద్ధమైన అధికారాలతో సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. సుప్రీం తీర్పు ప్రకారం ఆరోపణలు వచ్చిన అధికారులను సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు. ప్రత్యామ్నాయాలుండగా నేరుగా క్యాట్‌ను ఆశ్రయించరాదని, ముందుగా ప్రభుత్వం వద్దే అప్పీలు చేసుకోవాలన్నారు. ఆరోపణలను ప్రాథమికంగా పరిశీలించి సంతృప్తి చెందాకే సస్పెండ్ చేశామని.. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవని తెలిపారు. అయితే ఈ వాదనలతో ఏకీభవించని క్యాట్ సస్పెన్షన్‌పై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని.. ప్రస్తుత దశలో విచారణ చేపట్టవద్దన్న ప్రభుత్వ వాదనను క్యాట్ తోసిపుచ్చింది.
ఇవీ చదవండి: